బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
Published Mon, May 22 2017 3:01 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
ముంబై :
దేశంలోనే ఆరో అతిపెద్ద రుణదాత బ్యాంకు ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరోసారి భారీ నష్టాలను నమోదుచేసింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో ఈ బ్యాంకు నికర నష్టాలు 1,046 కోట్లగా ఫైల్ చేసింది. బ్యాడ్ లోన్స్ శాతం తగ్గకుండా అలానే అత్యధికంగా ఉండటంతో బ్యాంకుకు మరోసారి భారీ నష్టాలే నమోదయ్యాయి. అయితే ముందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది కొంత నష్టాలను బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించుకుంది. గతేడాది ఈ బ్యాంకు నష్టాలు రూ.3,587 కోట్లు. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంకు రూ.102 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత క్వార్టర్ కంటే ఆస్తుల నాణ్యత క్షీణించిందని బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం బ్యాంకుకు 9 శాతం పెరిగి రూ.3469 కోట్లగా నమోదయ్యాయని తెలిపింది.
ముందటి ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీ ఆదాయాలు రూ.3187 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం స్థూల నిరర్థక ఆస్తులు పెరగడమేనని తెలిసింది. డిసెంబర్ క్వార్టర్ లో రూ.51,781 కోట్లగా ఉన్న ఈ స్థూల నిరర్థక ఆస్తులు, ఈ క్వార్టర్ లో రూ.52,044 కోట్లకు పెరిగాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.49,879 కోట్లు. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్స్ అలానే అత్యధికంగా 13.22 శాతంగా ఉన్నాయి. గత క్వార్టర్ లో ఇవి 13.38 శాతం. ఫలితాల ప్రకటనాంతరం బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు 7 శాతం మేర నష్టపోయి, రూ.166 వద్ద నమోదవుతున్నాయి.
Advertisement