బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొండి బకాయిల భారం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.56 కోట్ల నికర నష్టం పొందింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, అన్ని సెగ్మెంట్లలో పేలవమైన పనితీరు కారణంగా నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయ లక్ష్మి అయ్యర్ చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి క్వార్టర్‌లో రూ.558 కోట్ల నికర లాభం పొందామని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.15 శాతం నుంచి 5.39 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,547 కోట్ల నుంచి 97 శాతం వృద్ధితో రూ.2,255 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.11,274 కోట్ల నుంచి రూ.12,287 కోట్లకు పెరిగిందని తెలిపారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14లో రూ.2,729 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15లో 37 శాతం క్షీణించి రూ.1,709 కోట్లకు తగ్గిందని అయ్యర్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.42,202 కోట్ల నుంచి రూ.47,663 కోట్లకు పెరిగిందని వివరించారు.. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ 6.6 శాతం క్షీణించి రూ.191 వద్ద ముగిసింది. సీఎండీగా రెండేళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మీ అయ్యర్ ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు.