బ్యాంకింగ్.. ‘సెల్’చల్! | Banking sector turning to mobile banking, e-commerce | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్.. ‘సెల్’చల్!

Published Wed, Sep 10 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

బ్యాంకింగ్.. ‘సెల్’చల్!

బ్యాంకింగ్.. ‘సెల్’చల్!

దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరుగుతుండటంతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు రెండు రెట్లు పెరగడం విశేషం. 2013-14 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ రూ. 3,190 కోట్లుగా ఉంటే అది  ఈ ఏడాది రూ. 10,118 కోట్లు దాటింది.

గతేడాది మొత్తం మీద జరిగిన లావాదేవీల విలువ రూ. 37,698 కోట్లు మాత్రమే. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగితే ఈ ఏడాది టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమీక్షా కాలంలో లావాదేవీల సంఖ్యలో కూడా భారీ వృద్ధి నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో 63 లక్షల లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 1.11 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో సగటు లావాదేవీ విలువ రూ. 5,145 నుంచి రూ. 9,198కి పెరగడం విశేషం.
 
ప్రైవేటు బ్యాంకులే టాప్
 మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులే ముందున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్‌బీఐ తప్ప మిగిలిన వాటిల్లో నామమాత్రపు లావాదేవీలే జరుగుతున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జూలై నెలలో రూ. 1,000 కోట్ల లావాదేవీలను నమోదు చేయడం ద్వారా ఈ మార్కును అందుకొన్న తొలి బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ రికార్డులకు ఎక్కింది.

 గతేడాది మొత్తం మీద రూ. 5,741 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ. 2,635 కోట్ల లావాదేవీలను నమోదు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబాంటీ బెనర్జీ తెలిపారు. గతేడాది మొదటి మూడు నెలల్లో రూ. 941 కోట్ల లావాదేవీలను ఐసీఐసీఐ బ్యాంక్ నమోదు చేసింది. ఈ ఏడాది మూడు నెలల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ. 2,269 కోట్లు, యాక్సిస్ రూ.1,826 కోట్లు, ఎస్‌బీఐ రూ.1,535 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి.

 బిల్లు చెల్లింపులే అధికం...
 మొబైల్ బ్యాంక్ ద్వారా జరుగుతున్న లావాదేవీల్లో ప్రధానంగా యుటిలిటీ బిల్లులు, మొబైల్ ఫోన్ రీ-చార్జ్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్సే ప్రధానంగా నమోదవుతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు, ఖాళీ సమయంలో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండటం కూడా లావాదేవీలు పెరగడానికి కారణంగా బెనర్జీ పేర్కొన్నారు. రానున్న కాలంలో మొబైల్ బ్యాంక్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 15.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని, ఈ సంఖ్య 2017 నాటికి 48 కోట్లు దాటుతుందని గూగుల్ తాజా సర్వే వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement