బ్యాంక్ షేర్లే.. మార్కెట్ లీడర్లు! | Banking shares under pressure; Nifty PSU Bank index falls nearly 5% | Sakshi
Sakshi News home page

బ్యాంక్ షేర్లే.. మార్కెట్ లీడర్లు!

Published Sat, Sep 24 2016 6:30 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

బ్యాంక్ షేర్లే.. మార్కెట్ లీడర్లు!

బ్యాంక్ షేర్లే.. మార్కెట్ లీడర్లు!

ప్రధాన సూచీల్ని మించిన బ్యాంక్ ఇండెక్స్
* గడిచిన ఏడాదిలో 18.38% పెరిగిన బ్యాంక్ నిఫ్టీ
* బ్యాంకుల్లో రూ.లక్ష కోట్లు దాటిన ఫండ్స్ నిధులు
* ప్రధాన ప్రైవేటు బ్యాంక్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు
* ఎస్‌బీఐ కన్నా 80 శాతం ఎక్కువున్న
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ

సాక్షి, బిజినెస్ విభాగం: అన్ని రంగాల షేర్లూ కలగలిసి ఉండే సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారంనాడు 0.4 శాతం వరకూ క్షీణించాయి. కానీ బ్యాంకు షేర్లు మాత్రమే ఉండే బ్యాంక్ నిఫ్టీ...

ఏకంగా 1 శాతానికి పైగా పతనమయింది. అంటే బ్యాంకు షేర్లు బాగా పతనమైనట్టేగా? నిజమే!! కానీ అదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే గడిచిన ఏడాదిలో బ్యాంకు షేర్లు బీభత్సంగా పెరిగాయి. అందుకని మిగతా షేర్లు పడ్డపుడు ఇవి మరి కాస్త ఎక్కువ పడే అవకాశాలుంటాయి. గడిచిన రెండేళ్ల నుంచీ చూసినా, ఏడాదిగా చూసినా... ఆరునెలలతో పోల్చినా ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, ఆయిల్, ఆటో తదితర రంగాల షేర్లకంటే బ్యాంకు అత్యంత వేగంగా పెరిగాయి. ప్రధాన సూచీలతో పోల్చినా బ్యాంక్ నిఫ్టీ అధిక రాబడులిచ్చింది. ఈ కాలంలో బ్యాంక్ ఇండెక్స్ జోరు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీతో పోలిస్తే రెట్టింపునకుపైనే వుంది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ రెండేళ్లలో నిఫ్టీ 8.85 శాతం పెరిగితే, బ్యాంక్ నిఫ్టీ 24.50 శాతం ఎగిసింది. 2015 సెప్టెంబర్ నుంచి చూస్తే నిఫ్టీ 12.69 శాతం పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ 18.38 శాతం ర్యాలీ జరిపింది.

బ్యాంకులు సమస్యల్లో ఉన్నా...
నిజానికి మన దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా ఇన్‌ఫ్రా తర్వాత బాగా దెబ్బతిన్న రంగమేదైనా వుంటే అది బ్యాంకింగ్ రంగమే. బ్యాంకుల మొండి బకాయిలు రూ.4 లక్షల కోట్లను మించిపోయాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 10 శాతాన్ని దాటాయి. కనిష్ట ఎన్‌పీఏలతో మంచి లాభాలు ఆర్జించే ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మొండి బకాయిలు కూడా ఇటీవల 5 శాతాన్ని చేరిపోయాయి. ఇన్‌ఫ్రా రంగం పట్ల ఇన్వెస్టర్లు మక్కువేమీ చూపించటం లేదు. దానికి కాస్త దూరంగానే ఉంటున్నారు.  కానీ బ్యాంకుల షేర్లను ఎగబడి కొంటున్నారు.

దాంతో వీటి విలువలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే తొలుత లాభపడేది బ్యాంకింగ్ రంగమేనని, ఎన్‌పీఏల పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉండే అవకాశం లేదనేది.. ఈ పెట్టుబడులకు ఫండ్ మేనేజర్లు చెబుతున్న సమాధానం.
 
అన్ని ఫండ్లకూ వీటిపైనే మక్కువ...
అటు విదేశీ ఇన్వెస్టర్లుగానీ, ఇటు దేశీయ ఫండ్స్‌గానీ గత కొద్ది నెలలుగా బ్యాంకుల షేర్లలో వారి పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు గతేడాది చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో వారి పెట్టుబడుల్ని తగ్గించుకున్నప్పటికీ, అటుతర్వాత మళ్లీ భారీగా నిధులు తరలించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్, కొటక్ బ్యాంకుల్లో అయితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారి గరిష్ట పరిమితుల్ని చేరిపోయాయి.

దీంతో వారికిపుడు ఆయా షేర్లను స్పెషల్ విండోల్లో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. స్పెషల్ విండో అంటే ఒక విదేశీ ఇన్వెస్టరు అమ్మితేనే, మరో విదేశీ ఇన్వెస్టరు దానిని కొనొచ్చు. ఇక బ్యాంక్ షేర్లలో దేశీయ ఫండ్స్ పెట్టుబడులు ఈ ఏడాది ఆగస్టు చివరికి  రూ.లక్ష కోట్లను మించాయి. జూలై చివరికికి వీటిలో ఫండ్స్ పెట్టుబడులు రూ.82,042 కోట్లు కాగా, ఆగస్టునాటికి రూ.1,05,115 కోట్లకు చేరాయి. అదే సాఫ్ట్‌వేర్ షేర్లలో రూ.38,749 కోట్లు, ఫార్మా షేర్లలో రూ.38,206 కోట్ల చొప్పున ఫండ్ల పెట్టుబడులున్నాయి.  ఫండ్స్ మొత్తం ఆస్తుల్లో ఆగ స్టు చివరినాటికి బ్యాంకింగ్ షేర్ల వాటా 20.90 శాతానికి చేరింది.
 
అగ్రగామి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...
ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక పెట్టుబడుల్ని ఆకర్షించింది ప్రైవేటు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.40 లక్షల కోట్లు. ఫైనాన్షియల్ రంగానికి కేంద్రంగా వున్న యూరప్‌లో ఏ ప్రధాన బ్యాంకుకూ లేనంత మార్కెట్ విలువ ఈ భారతీయ బ్యాంకుకు ఉంది. ఇది 14 వేలకుపైగా బ్రాంచీలున్న ఎస్‌బీఐ మార్కెట్ విలువకన్నా దాదాపు 80% ఎక్కువ. ఎస్‌బీఐ మినహా మిగిలిన మన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటి మార్కెట్ విలువా కలిపినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కన్నా తక్కువే.

అతి తక్కువ శాతం ఎన్‌పీఏలతో ప్రతి త్రైమాసికంలోనూ 20-30% లాభాల్ని స్థిరంగా ఆర్జిస్తున్న ఏకైక బ్యాంక్ కావడంతో ఇన్వెస్టర్లు దీన్ని ఎగబడి కొంటున్నారు. ఇండియాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరును కొనాలంటే విదేశీ ఇన్వెస్టర్లకు స్పెషల్ విండో ద్వారానే సాధ్యమవుతున్నందున, వారు అమెరికా నాస్‌డాక్‌లో లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడీఆర్‌ను భారత్‌లో ధరతో పోలిస్తే 23% ప్రీమియంకు కొనేస్తున్నారు.
 
బ్యాంక్ ఇండె క్స్ పరుగుకు కారణం...
బ్యాంక్ నిఫ్టీ ప్రధాన సూచీల్ని బాగా అధిగమించడానికి ముఖ్య కారణం కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే. 12 బ్యాంకింగ్ షేర్లున్న బ్యాంక్ నిఫ్టీలో ఈ షేరుకు 28% వెయిటేజి వుంది. తర్వాత ఎస్‌బీఐకి 16%, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 13%, కొటక్ బ్యాంక్‌కు 12%, యాక్సిస్ బ్యాంక్‌కు 11% వెయిటేజీ వున్నాయి. ఈ ఐదు బ్యాంకులూ కలిసి ఇండెక్స్‌ను శాసిస్తున్నాయి. ఇప్పుడు రూ.1312 ధర ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ఒక శాతం తగ్గినా, పెరిగినా, దాదాపు 20,000 పాయింట్ల స్థాయిలో వున్న ఈ ఇండెక్స్ 3 శాతం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ షేరు 52 శాతం ర్యాలీ జరపగా, 2015 ఇదే నెల నుంచి 27 శాతం ఎగిసింది. ఈ రెండేళ్లలో ఎన్‌పీఏ సమస్యలతో ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ, యాక్సిస్‌లు క్షీణించినా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కారణంగా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ సాగించగలిగింది.
 
బ్రోకింగ్ సంస్థల హెచ్చరికలు...
అయితే ఇదే సందర్భంలో మూడు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలు భారత్ ఈక్విటీల పట్ల, ప్రత్యేకించి బ్యాంకింగ్ షేర్ల పట్ల హెచ్చరికలు జారీ చేశాయి. మోర్గాన్ స్టాన్లీ తన ఎమర్జింగ్ మార్కెట్స్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోలో ఇండియా వెయిటేజిని 32.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ షేర్ల పరుగు ఎక్కువకాలం ఉండబోదని, భారత్ బ్యాంకుల డిపాజిట్, రుణ వృద్ధి మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి పడిపోయిందని పేర్కొంది. మరోవైపు  భారత్ షేరు విలువలు బాగా ఖరీదైపోయాయని, వీటిని తగ్గించుకోవాలంటూ ‘అండర్‌వెయిట్’ హెచ్చరికను ఈ వారం ప్రారంభంలో మరో దిగ్గజ బ్రోకింగ్ సంస్థ క్రెడిట్‌సూసీ తన క్లయింట్లకు జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement