తగ్గిన నిఫ్టీ, పెరిగిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 7,912 వద్ద ముగింపు
♦ 36 పాయింట్ల లాభంతో 25,880కు సెన్సెక్స్
బ్యాంక్ షేర్ల లాభాలకు ఐటీ షేర్ల నష్టాలు గండి కొట్టడంతో స్టాక్ మార్కెట్ గురువారం స్వల్పలాభాలతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్ వరుసగా ఆరో రోజూ లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆరు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 25,880 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 16 వారాల తర్వాత సెన్సెక్స్‌కు ఇది ముగింపులో గరిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఈ ఏడాది గరిష్ట స్థాయి(7,978 పాయింట్లు)ని తాకిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 3 పాయింట్లు క్షీణించి 7,912 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, షేర్లు నష్టపోయాయి. ముడి చమురు ధరలు రికవరీ కావడం, అంతర్జాతీయంగా మార్కెట్లు లాభాల్లో ఉండడం సానుకూల ప్రభావం చూపాయి.
ఆరు రోజుల్లో సెన్సెక్స్‌కు 1,206 పాయింట్ల లాభం
ఆసియా మార్కెట్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ 25,980 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్ల జోరుతో 26వేల పాయింట్లను దాటింది. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో ఇంట్రాడేలో 27,783 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 36 పాయింట్ల లాభంతో 25,880 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,206 పాయింట్లు లాభపడింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 368 పాయింట్లు లాభపడింది. మొండి బకాయిలకు జరపాల్సిన కేటాయింపులకు సంబంధించి కంపెనీల సంఖ్య(150) నుంచి 20 కంపెనీలను ఆర్‌బీఐ తొలగించిందన్న వార్తలతో బ్యాంక్ షేర్లు దూసుకుపోయాయి. తొలగించిన కంపెనీల మొండి బకాయిలకు కేటాయింపులు జరపాల్సిన అవసరం లేకపోవడంతో బ్యాంకుల రుణ వ్యయం తగ్గి లాభదాయకతపై ఒత్తడి మరింతగా తగ్గుతుందన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయని విశ్లేషకులుంటున్నారు.
విప్రో 7 శాతం డౌన్...
నికర లాభం 1.6 శాతం తగ్గడంతో విప్రో షేర్ 7 శాతం క్షీణించి రూ.559 వద్ద ముగిసింది. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 14 లాబాల్లో, 16 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా 2.8 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, టాటా మోటార్స్ 1.8 శాతం, ఓఎన్‌జీసీ 1.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.9 శాతం, సిప్లా 2 శాతం, మారుతీ 0.7 శాతం, సన్ ఫార్మా 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.4 శాతం చొప్పున పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, భెల్ 2.8 శాతం, హీరో మోటొకార్ప్ 1.7 శాతం, ఐటీసీ 1.6 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.5 శాతం, అదానీ పోర్ట్స్ 1.2 శాతం చొప్పున తగ్గాయి. 1,494 షేర్లు నష్టాల్లో, 1,080 షేర్లు లాభాల్లో ముగిశాయి.