బ్యాంకులకు 2 లక్షల కోట్లు దెబ్బ
బ్యాంకులకు 2 లక్షల కోట్లు దెబ్బ
Published Wed, Jul 19 2017 6:05 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
ముంబై : మొండిబకాయిల బెడదను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న బ్యాంకులు భారీమొత్తంలో తమ నగదును వదులుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తమ 50 అతిపెద్ద స్ట్రెస్డ్ అసెట్ ఖాతాల మొండిబకాయిల విలువలో 60 శాతం బ్యాంకులు రైటాఫ్ చేయాల్సి వస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చెప్పింది. దీంతో బ్యాంకులు రూ.2.4 లక్షల కోట్ల నగదును కోల్పోవాల్సి వస్తుందని క్రిసిల్ పేర్కొంది. ఈ 50 స్ట్రెస్డ్ కంపెనీలు తమ రుణాలను చెల్లించేందుకు సిద్ధంగా లేరని క్రిసిల్ అనాలసిస్ తెలిపింది. వీటి గురించి బ్యాంకులు కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించింది. మొండిబకాయిల వసూల క్రమంలో ఇది చోటుచేసుకోనుందని వివరించింది. ఈ సంస్థల మొత్తం మొండిబకాయిలు రూ.4 లక్షల కోట్ల మేర ఉన్నాయి.
స్ట్రెస్డ్ కంపెనీల్లో నిర్మాణ రంగం అత్యధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగిఉంది. మొత్తం మొండిబకాయిల్లో నాలుగో వంతు రుణాలు ఈ రంగానివే. అదేవిధంగా మెటల్ రంగం కూడా అత్యధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగి ఉన్నట్టు తెలిసింది. అనంతరం 15 శాతంతో పవర్ సెక్టార్ ఉంది. మొత్తం నిరర్థక ఆస్తుల్లో కనీసం సగానికి పైగా రుణాలు ఈ రంగాలివే. బ్యాంకుల వద్ద మొత్తం నిరర్థక ఆస్తులు రూ.7.29 లక్షల కోట్లగా తేలింది. భారత జీడీపీలో ఇవి 5 శాతం. ఆర్థిక విలువ ఆధారితంగా ఈ రైటాఫ్ విలువను లెక్కించామని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ అనాలిటికల్ ఆఫీసర్ పవన్ అగర్వాల్ చెప్పారు. చివరిగా తీసుకునే రైటాఫ్ విలువ, బ్యాంకుల అంచనాలు, సబ్సిడరీలు వాల్యుయేషన్, కమోడిటీతో లింకయ్యే సెక్టార్ల ధరల అవుట్‌లుక్‌తో ప్రభావితమై ఉంటుందని క్రిసిల్ వివరించింది.
Advertisement
Advertisement