Stressed Assets
-
ఢిల్లీ హైకోర్టుకు ‘యస్ బ్యాంక్ ఒత్తిడి రుణ’ బదలాయింపు వివాదం
న్యూఢిల్లీ: జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి యస్ బ్యాంక్‌కు చెందిన రూ. 48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ (మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న) పోర్ట్‌ఫోలియోను బదిలీ చేయడంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బదలాయింపుపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, ఆర్బీఐ, సెబీల ప్రతి స్పందనను కోరింది. సమాధానానికి నాలుగు వారాల గడువును ఇస్తూ, తదుపరి కేసును జూలై 14న లిస్ట్ చేయాలని ఆదేశించింది. రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యం స్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలకూ తావివ్వకుండా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని, ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, సెబీలను ఆదేశించాలని ఆయన ఈ పిటిషన్లో కోరారు. ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్లకు సంబంధించిన మూడేళ్ల లాకిన్ వ్యవధి ఈ నెల 13వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాŠంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు రూ. 10,000 కోట్ల చొప్పున సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. యస్ బ్యాంక్ షేర్ ఎన్ఎస్ఈలో శుక్రవారం 1 శాతం పెరిగి రూ.15.05కు చేరింది. -
మొండిబాకీలపై 23లోగా ఆర్బీఐ కొత్త సర్క్యులర్
న్యూఢిల్లీ, ముంబై: మొండిబాకీలకు సంబంధించి సవరించిన సర్క్యులర్‌ను రిజర్వ్ బ్యాంక్ మే 23 లోగానే విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేదీకి ముందే సర్క్యులర్ విడుదల కావొచ్చని పేర్కొన్నాయి. రూ. 2,000 కోట్లకు మించిన మొండిబాకీలపై ఆర్బీఐ గతంలో విడుదల చేసిన ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సవరించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి వస్తోంది. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికలకు సంబంధించిన నైతిక నియమావళి అడ్డంకిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. కానీ ఆర్బీఐ సర్క్యులర్‌కు ఇది సమస్య కాబోదని, మే 23 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేది) లోగానే సవరించిన సర్క్యులర్‌ను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నైతిక నియమావళి నుంచి ఆర్బీఐ పరపతి విధానానికి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ గానీ సవరించిన సర్క్యులర్ విడుదల చేస్తే దానిపై నియమావళి ప్రభావం ఉండబోదు‘ అని వివరించాయి. పాత సర్క్యులర్‌ను పూర్తిగా తిరగరాయకుండా.. కొంత మేర సవరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. మొండిబాకీ వర్గీకరణకు 90 రోజుల వ్యవధిని యథాతథంగా ఉంచినప్పటికీ.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అదనంగా మరో 30–60 రోజులు సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనితో రుణాల చెల్లింపునకు కొంత అదనపు సమయం దొరికితే చిన్న, మధ్య తరహా సంస్థలకు కాస్త ఊరట లభించవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఈ నెల తొలినాళ్లలో సుప్రీం కోర్టు మొండిబాకీలపై సర్క్యులర్‌ను కొట్టివేసింది. ఫలితంగానే ఆర్బీఐ కొత్తగా సవరించిన నిబంధనలు ప్రకటించాల్సి వస్తోంది. బ్యాంకులతో పాటు విద్యుత్ రంగ సంస్థలు మొదలైన పరిశ్రమ వర్గాలన్నింటి అభిప్రాయాలను సేకరించి ఆర్బీఐ వీటిని రూపొందిస్తోంది. -
రూ 40,400 కోట్లు రాబట్టాయి : ఆర్బీఐ నివేదిక
సాక్షి, ముంబై : దివాలా చట్టానికి కోరలుతేవడం, సర్ఫేసి చట్ట సవరణలతో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు ఒత్తడికి లోనయ్యే రుణాల రికవరీలో గణనీయ పురోగతి సాధించాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ 40,400 కోట్ల రాని బాకీలను వసూలు చేశాయని ఇవి 2017 ఆర్థిక సంవత్సరంలో రూ 38,500 కోట్లుగా నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది. దివాలా చట్టం (ఐబీసీ), సర్ఫేసి చట్టం, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్ వంటి వివిధ మార్గాల్లో బ్యాంకులు మొండి బకాయిలు, రాని బాకీలను పరిష్కరించుకున్నాయని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా బ్యాంకులు రూ 4900 కోట్ల మేర రాని బాకీలను వసూలు చేయగా, సర్ఫేసి చట్టం ద్వారా రూ 26,500 కోట్లను రాబట్టాయని 2017-18లో బ్యాంకింగ్ ధోరణలు, పురోగతిపై ఆర్బీఐ ఈ వారాంతంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో పొందుపరిచింది. మొండి బకాయిల సత్వర వసూలుకు సర్ఫేసి చట్టాన్ని సవరిస్తూ బాకీ దారు 30 రోజుల్లోగా తన ఆస్తుల వివరాలను వెల్లడించకుంటే మూడు నెలల జైలు శిక్షతో పాటు పలు కఠిన నిబంధనలు విధించడంతో రుణాల వసూలు ప్రక్రియ వేగవంతమైందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. మరోవైపు బకాయిదారు ఆస్తుల వివరాలతో నిర్ధేశిత గడువులోగా ముందుకు రాకుంటే తనఖాలో ఉంచిన ఆస్తులను ఆయా బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధన కూడా రుణాల సత్వర వసూళ్లకు ఊతమిస్తోందని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు అధికంగా వసూలవుతున్నాయని వెల్లడించింది. మొండి బకాయిలు, రాని బాకీల వసూళ్లలో ఐబీసీ ముఖ్యమైన మార్గంగా ఉపకరిస్తోందని తెలిపింది. -
బ్యాంకులకు 2 లక్షల కోట్లు దెబ్బ
ముంబై : మొండిబకాయిల బెడదను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న బ్యాంకులు భారీమొత్తంలో తమ నగదును వదులుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తమ 50 అతిపెద్ద స్ట్రెస్డ్ అసెట్ ఖాతాల మొండిబకాయిల విలువలో 60 శాతం బ్యాంకులు రైటాఫ్ చేయాల్సి వస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చెప్పింది. దీంతో బ్యాంకులు రూ.2.4 లక్షల కోట్ల నగదును కోల్పోవాల్సి వస్తుందని క్రిసిల్ పేర్కొంది. ఈ 50 స్ట్రెస్డ్ కంపెనీలు తమ రుణాలను చెల్లించేందుకు సిద్ధంగా లేరని క్రిసిల్ అనాలసిస్ తెలిపింది. వీటి గురించి బ్యాంకులు కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించింది. మొండిబకాయిల వసూల క్రమంలో ఇది చోటుచేసుకోనుందని వివరించింది. ఈ సంస్థల మొత్తం మొండిబకాయిలు రూ.4 లక్షల కోట్ల మేర ఉన్నాయి. స్ట్రెస్డ్ కంపెనీల్లో నిర్మాణ రంగం అత్యధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగిఉంది. మొత్తం మొండిబకాయిల్లో నాలుగో వంతు రుణాలు ఈ రంగానివే. అదేవిధంగా మెటల్ రంగం కూడా అత్యధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగి ఉన్నట్టు తెలిసింది. అనంతరం 15 శాతంతో పవర్ సెక్టార్ ఉంది. మొత్తం నిరర్థక ఆస్తుల్లో కనీసం సగానికి పైగా రుణాలు ఈ రంగాలివే. బ్యాంకుల వద్ద మొత్తం నిరర్థక ఆస్తులు రూ.7.29 లక్షల కోట్లగా తేలింది. భారత జీడీపీలో ఇవి 5 శాతం. ఆర్థిక విలువ ఆధారితంగా ఈ రైటాఫ్ విలువను లెక్కించామని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ అనాలిటికల్ ఆఫీసర్ పవన్ అగర్వాల్ చెప్పారు. చివరిగా తీసుకునే రైటాఫ్ విలువ, బ్యాంకుల అంచనాలు, సబ్సిడరీలు వాల్యుయేషన్, కమోడిటీతో లింకయ్యే సెక్టార్ల ధరల అవుట్‌లుక్‌తో ప్రభావితమై ఉంటుందని క్రిసిల్ వివరించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిలు (ఎన్పీఏ) పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం దీనిపై ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. బకాయిల సమస్యను అధిగమించడానికి పలు సూచనలు చేసింది. దీనిపై ప్రజా స్పందనకు జనవరి1వ తేదీ వరకూ సమయం ఇస్తున్నట్లు తెలిపింది. మొండిబకాయి అకౌంట్‌ను సకాలంలో పరిష్కరించుకోవడానికి కలసికట్టుగా ముందుకువచ్చే సంబంధిత రుణదాతలను(బ్యాంకులను) ప్రోత్సహించడం ఆర్బీఐ ప్రతిపాదనల్లో ఒకటి. రుణాల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, బ్యాంకులకు సహకరించని రుణ గ్రహీతలపై భవిష్యత్తులో అధిక వడ్డీరేట్లు విధించడం వంటి ప్రతిపాదన సైతం ఇందులో ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు... ఆర్థిక ఒత్తిళ్లను ముందుగానే గుర్తించడం- సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు-విధాన రూపకల్పన’ పేరుతో ఈ పత్రం విడుదలైంది. కొన్ని రుణ అకౌంట్లను కలసికట్టుగా పరిష్కరించుకోడానికి, ఈ మేరకు తీర్మానించుకోడానికి బ్యాంకర్లు విఫలమయితే అది తీవ్ర ప్రతికూలతకు దారితీస్తోంది. ప్రొవిజనింగ్‌లు భారం కావడానికి కారణమవుతోంది. ప్రస్తుత రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మెరుగుపరచాలి. సంబంధిత అసెట్స్ విలువ కట్టే విషయంలో స్వతంత్ర వ్యవస్థ, ప్రమోటర్లు-క్రెడిటర్ల మధ్య నష్టాల పంపిణీ విషయంలో పారదర్శక విధానాలు, అనుసరించడానికి వీలైన ప్రణాళికలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. బకాయిల ఒత్తిడిలో ఉన్న ఆస్తులను కొనుగోలు చేయడానికి సంబంధించి నిర్ధిష్ట కంపెనీలను, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ప్రోత్సహించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అంటే మార్చి కల్లా టాప్ 41 బ్యాంకుల స్థూల మొండి బకాయిలు మొత్తం రుణాల్లో 4.5 శాతానికి అంటే రూ.2.9 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్‌కు ఈ రేటు 4 శాతం (రూ.2.37 లక్షల కోట్లు). మార్చికల్లా మొత్తం మొండి బకాయిల్లో 26 ప్రభుత్వరంగ బ్యాంకుల వాటానే వాటి రుణాల్లో 4.8 శాతం నుంచి 5 శాతం వరకూ (దాదాపు రూ.2.6 లక్షల కోట్లని) ఉంటుందన్నది అంచనా. గత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఈ పరిమాణం 3.6 % అంటే రూ.1.64 లక్షల కోట్లు.