మొండి బకాయిలపై ఆర్‌బీఐ అస్త్రం
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం దీనిపై ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. బకాయిల సమస్యను అధిగమించడానికి పలు సూచనలు చేసింది. దీనిపై ప్రజా స్పందనకు జనవరి1వ తేదీ వరకూ సమయం ఇస్తున్నట్లు తెలిపింది. మొండిబకాయి అకౌంట్‌ను సకాలంలో పరిష్కరించుకోవడానికి కలసికట్టుగా ముందుకువచ్చే సంబంధిత రుణదాతలను(బ్యాంకులను) ప్రోత్సహించడం ఆర్‌బీఐ ప్రతిపాదనల్లో ఒకటి. రుణాల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, బ్యాంకులకు సహకరించని రుణ గ్రహీతలపై భవిష్యత్తులో అధిక వడ్డీరేట్లు విధించడం వంటి ప్రతిపాదన సైతం ఇందులో ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు...
- ఆర్థిక ఒత్తిళ్లను ముందుగానే గుర్తించడం- సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు-విధాన రూపకల్పన’ పేరుతో ఈ పత్రం విడుదలైంది.
- కొన్ని రుణ అకౌంట్లను కలసికట్టుగా పరిష్కరించుకోడానికి, ఈ మేరకు తీర్మానించుకోడానికి బ్యాంకర్లు విఫలమయితే అది తీవ్ర ప్రతికూలతకు దారితీస్తోంది. ప్రొవిజనింగ్‌లు భారం కావడానికి కారణమవుతోంది.
- ప్రస్తుత రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను మెరుగుపరచాలి. సంబంధిత అసెట్స్ విలువ కట్టే విషయంలో స్వతంత్ర వ్యవస్థ, ప్రమోటర్లు-క్రెడిటర్ల మధ్య నష్టాల పంపిణీ విషయంలో పారదర్శక విధానాలు, అనుసరించడానికి వీలైన ప్రణాళికలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
- బకాయిల ఒత్తిడిలో ఉన్న ఆస్తులను కొనుగోలు చేయడానికి సంబంధించి నిర్ధిష్ట కంపెనీలను, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ప్రోత్సహించాలి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అంటే మార్చి కల్లా టాప్ 41 బ్యాంకుల స్థూల మొండి బకాయిలు మొత్తం రుణాల్లో 4.5 శాతానికి అంటే రూ.2.9 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్‌కు ఈ రేటు 4 శాతం (రూ.2.37 లక్షల కోట్లు). మార్చికల్లా మొత్తం మొండి బకాయిల్లో 26 ప్రభుత్వరంగ బ్యాంకుల వాటానే వాటి రుణాల్లో 4.8 శాతం నుంచి 5 శాతం వరకూ (దాదాపు రూ.2.6 లక్షల కోట్లని) ఉంటుందన్నది అంచనా. గత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఈ పరిమాణం 3.6 % అంటే రూ.1.64 లక్షల కోట్లు.