బ్యాంకులకు సర్వాధికారాలు
విల్‌ఫుల్ డిఫాల్టర్లపై
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు)పై చర్యల విషయంలో బ్యాంకులకు సర్వాధికారాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల చీఫ్‌లతో త్రైమాసిక సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్టీల్ సహా వివిధ రంగాల్లో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) ఆమోదనీయస్థాయిని మించి పెరిగిపోవడంపట్ల జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను బ్యాంకుల అధిపతులు, ఆర్‌బీఐ అధికారులతో చర్చించారు. వృద్ధిరేటు క్రమంగా జోరందుకుంటున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎన్‌పీఏల ఒత్తిడి నుంచి బ్యాంకులు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. పీఎస్‌బీల్లో స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది జూన్ చివరి నాటికి 6.03 శాతానికి(మొత్తం రుణాల్లో) ఎగబాకడం తెలిసిందే. మార్చి చివరికి ఈ పరిమాణం 5.2 శాతంగా ఉంది.
భేటీలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య సహా వివిధ బ్యాంకుల అధిపతులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన కార్యదర్శులు కూడా తాము నేతృత్వం వహిస్తున్న రంగాలకు సంబంధించి ప్రాజెక్టులకు రుణ అవసరాలపై ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న జనధన యోజన, ముద్ర యోజన, పెన్షన్లు ఇతరత్రా సామాజిక భద్రత పథకాల అమలు తీరుతెన్నులపై కూడా జైట్లీ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు.
మరోపక్క, సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ రెపో రేటు కోత తర్వాత బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు చర్యలపై కూడా ఆర్థిక మంత్రి చర్చించారు. జనధన యోజన స్కీమ్‌ను విజయవంతంగా అమలు చేసిన బ్యాంకులు, సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు.
‘కొంత మంది డిఫాల్టర్లు చాలా బ్యాంకుల జాబితాలో ఉన్న విషయం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో బ్యాంకులకు ఇప్పుడు పూర్తి అధికారాలు, స్వేచ్ఛ ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. డిఫాల్ట్ కేసుల పరిష్కారానికి సంబంధించి ఆర్‌బీఐ బ్యాంకులకు అన్ని అధికారాలూ ఇచ్చిందని.. కొత్తగా ప్రవేశపెట్టిన దివాలా(బ్యాంక్రప్సీ) చట్టం కూడా బ్యాంకింగ్ కార్యకలాపాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తుందన్నారు.
తాజాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.7,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి విజయ్ మాల్యాను ఎస్‌బీఐ విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటే...
వివిధ పారిశ్రామిక రంగాల్లో ఇబ్బందులు తొలగి.. ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటే బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని జైట్లీ పేర్కొన్నారు.
పీఎస్‌బీలకు ‘ఇంధ్రధనుష్’ పథకంలో భాగంగా తొలివిడత ఇప్పటికే రూ.20 వేల కోట్ల మూలధనాన్ని కేంద్రం అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయ రహదారుల రంగాన్ని గాడిలోపెట్టామని.. ఇటీవల ప్రకటించిన విద్యుత్ రంగ సంస్కరణల కారణంగా డిస్కమ్‌ల రుణ భారం వల్ల తలెత్తిన సమస్యలు కూడా దిగొస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, హౌసింగ్, విద్య, టెక్స్‌టైల్స్ తదితర విభాగాలకు రుణ కల్పన అంశాన్ని కూడా భేటీలో ఆర్థిక మంత్రి చర్చించారు.
దశలవారీగా గోల్డ్ బాండ్లు...
గోల్డ్ బాండ్ల పథకాన్ని దశలవారీగా పునఃప్రారంభిస్తామని జైట్లీ చెప్పారు. తొలి విడత గోల్డ్ బాండ్ల జారీ ఈ నెల 20తో ముగిసిన సంగతి తెలిసిందే.
స్టీల్ రంగంలో తీవ్ర సమస్యలు..
అంతర్జాతీయంగా మందగమనం కారణంగా ధరలు ఘోరంగా పడిపోయి స్టీల్, అల్యూమినియం రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జైట్లీ చెప్పారు. ఈ రంగాలను ఆదుకోవడానికి సంబంధించి ఇతరత్రా ఎటువంటి విధానపరమైన చర్యలు తీసుకోవాలన్నదానిపై బ్యాంకులు, రెవెన్యూ విభాగాలు చర్చించనున్నాయన్నారు.
దీన్ని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి పర్యవేక్షిస్తారని ఆర్థిక మంత్రి చెప్పారు. బ్యాంకుల ఎన్‌పీఏల్లో స్టీల్ రంగానికి చెందిన కంపెనీల నుంచే భారీగా ఉండటం గమనార్హం. కాగా, దేశీ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ఉక్కుపై 20 శాతం రక్షణాత్మక దిగుమతి సుంకం విధింపుతోపాటు పలు చర్యలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.
డిజిన్వెస్ట్‌మెంట్‌పై మార్కెట్ ప్రభావం
స్టాక్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడితేనే కొన్ని పీఎస్‌యూల్లో ముఖ్యంగా లోహ రంగాలకు చెందిన కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు(డిజిన్వెస్ట్‌మెంట్) వీలవుతుందని జైట్లీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెటల్ స్టాక్స్ భారీగా పడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటువంటి తరుణంలో వీటిలో వాటాల అమ్మకం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ ఏడాది(2015-16) ప్రభుత్వం నిర్ణయించిన రూ.69,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరడం కష్టమేనన్న వాదనల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తవుతున్నప్పటికీ.. నాలుగు కంపెనీల్లో(పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీ) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.12,600 కోట్లను మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన 20 వరకూ కంపెనీలు వరుసలో ఉన్నాయి.