ఏటీఎం‘లోనూ’ తీసుకోవచ్చు! | Banks may soon provide personal loan through ATM machine | Sakshi
Sakshi News home page

ఏటీఎం‘లోనూ’ తీసుకోవచ్చు!

Published Sun, Aug 28 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ఏటీఎం‘లోనూ’ తీసుకోవచ్చు!

ఏటీఎం‘లోనూ’ తీసుకోవచ్చు!

డబ్బులు కావాలని ఏటీఎంకు వెళ్లారు. విత్‌డ్రా చేసుకున్నారు. అంతే! పని అయిపోయింది కదా అని వచ్చేయకండి. ఒక్కసారి ఏటీఎం స్క్రీన్ వంక చూడండి. మీకు ఇన్‌స్టంట్ లోన్ ఆఫర్ ఏదైనా ‘ఫ్లాష్’ అవుతుందేమో పరిశీలించండి. ఒకవేళ ఫ్లాష్ అయితే... మీకు గనక లోన్ కావాలనుకుంటే... అక్కడే జస్ట్ క్లిక్ చేస్తే చాలు. మీ ఖాతాలోకి డబ్బు వచ్చేస్తుంది. దాన్ని అదే ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవచ్చు కూడా!! ఇదీ బ్యాంకుల కొత్త వ్యూహం. ఏటీఎంలే బ్యాంక్ బ్రాంచీలుగా మారి, అప్పటికప్పుడు  మీకు చిన్న మొత్తాల్లో వ్యక్తిగత రుణ సౌలభ్యం కల్పించే వ్యవస్థ త్వరలో ఏర్పాటవుతోంది.

రిటైల్ రుణాల్ని పెంచటానికిబ్యాంకుల వ్యూహం
* మొబైల్ వెరిఫికేషన్‌తో తక్షణమే డబ్బు జమ
* ఏటీఎంలతో మరిన్ని సేవల దిశగా బ్యాంకుల చర్యలు

ఏటీఎంల ద్వారా సేవలు, ఉత్పత్తుల విస్తరణకు ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. దేశంలో దాదాపు 1.9 లక్షల ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు సగం బ్యాంక్ బ్రాంచీల వద్దే ఉండగా, మిగిలినవి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. పలు బ్యాంకులు తమ ఏటీఎంలను ఈ-బ్యాంకింగ్ సెంటర్లుగా ఇప్పటికే అభివృద్ధి చేశాయి.
 
రుణం మంజూరు చేసేది ఇలా...

మీరు ఏం చేస్తున్నారు? ఆదాయం ఎంత? వ్యక్తిగత వివరాలేంటి? మీ చెల్లింపు సామర్థ్యమేంటి? వంటి వివరాలను మీ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకులు ముందే ‘ఆల్గో రిథమ్’ విధానంగా విశ్లేషిస్తాయి. దాన్నిబట్టే మీకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించి దాన్ని ఆఫర్ చేస్తాయి. మీ డెబిట్ కార్డ్‌తో స్వైప్ చేయగానే మీ కళ్లముందు ఈ ఆఫర్ ఉందనుకోండి. వెంటనే మీరు దీనికి ఓకే చేసి, ‘మొబైల్ నెంబర్’ టైప్ చేస్తే... ఆ మొబైల్‌కు వెంటనే వన్‌టైమ్ పాస్‌వర్డ్ ఒకటి వస్తుంది. దాన్ని ఎంటర్ చేశారనుకోండి.

ఏటీఎం దాన్ని వెరిఫై చేసుకుంటుంది. అంతే!! క్షణాల్లో మీ అకౌంట్‌లో డబ్బు జమవుతుంది. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ రుణాల్లో వృద్ధి పెద్దగా ఉండటం లేదు. దీంతో బ్యాంకులు రిటైల్ రుణాలను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... ముందుగానే కస్టమర్లకు రుణ ఆఫర్లను అందించబోతున్నాయి.
 
సెలవు రోజుల్లోనూ ఇబ్బంది ఉండదు...

తాజా పరిణామంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్‌సెక్యూర్డ్ లోన్స్ అండ్ మార్టిగేజ్ విభాగం హెడ్ అరవింద్ కపిల్ వ్యాఖ్యానిస్తూ... ‘‘ఏటీఎం ఇప్పుడు కస్టమర్లకు అతి చేరువగా ఉన్న బ్యాంకింగ్ సాధనం. ప్రతి బ్యాంక్ కస్టమర్ తరచూ దాని ముందుకు వెళ్లి తీరవలసిందే. బ్యాంకింగ్ రిటైల్ రుణ వృద్ధికి ఇప్పుడు ఇదే ఒక మార్గం కానుంది. సెలవైనా... ఏ అత్యవరసర పరస్థితుల్లోనైనా తక్షణం రుణం పొందే సౌలభ్యం ఏటీఎంల ద్వారా ఏర్పడుతోంది’’ అన్నారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్‌ఫర్‌మేషన్ ఆఫీసర్ మృత్యుంజయ్ మహాపాత్ర కూడా దీంతో ఏకీభవించారు. ‘‘బ్యాంకులు తమ ఉత్పత్తుల విస్తృతికి మల్టీ వెండార్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నాయి.

క్రెడిట్, ఇన్సూరెన్స్ ప్రొడక్టుల విక్రయం వంటివి ఏటీఎం ద్వారా సాధ్యమే. అన్ని హార్డ్‌వేర్లలో పనిచేసే మల్టీ వెండార్ సాఫ్ట్‌వేర్ వల్ల తన పూర్తి ఏటీఎం నెట్‌వర్క్ బ్యాంక్ నియంత్రణలో ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో బ్యాంక్ ప్రొడక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేయొచ్చు’’ అని చెప్పారాయన. తన 50,000 ఏటీఎం నెట్‌వర్క్‌కు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలన్నది ఎస్‌బీఐ లక్ష్యమని తెలియజేశారు. సగటున తమ ఒక్కొక్క ఏటీఎంకు రోజూవారీగా 400 నుంచి 500 హిట్స్ వస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
 
బ్యాంక్ కస్టమర్ అయితే ఈజీ...
తన సొంత కస్టమర్ అయితే ఒక బ్యాంక్  వెనువెంటనే అవసరమైన ప్రక్రియ అంతా పూర్తిచేసి, లోన్‌ను జారీ చేస్తుందేమో కానీ, వేరే బ్యాంక్ కస్టమర్ అయితే ఇలాంటి పక్రియ కాస్త కష్టమేనని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వేరే బ్యాంక్ కస్టమర్ అయితే... రుణ మంజూరుకు ముందు ‘అప్లికేషన్ దాఖలు’ పక్రియ అంతా మామూలేనని వారు పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్ కాని వ్యక్తి విషయంలో ‘కాల్ బ్యాంక్’ అనే ఆప్షన్‌ను ఇస్తున్నాం. తద్వారా తనను సంప్రదించవలసిన వివరాలన్నీ సంబంధిత కస్టమర్ తెలియజేసే వీలుంటుంది. సంబంధిత వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రాతిపదికన, మేం తిరిగి అతనికి కాల్ చేస్తాం. అప్లికేషన్ దాఖలు ప్రక్రియ ద్వారా అతనికి రుణ సేవలు అందిస్తాం’’ అని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ అమిత్ సేథి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement