బ్యాంకుల్లో ఆధార్ సెంటర్ తప్పనిసరి
నిర్దిష్ట సంఖ్యలో ఏర్పాటు చేయకుంటే రూ.20వేల జరిమానా
న్యూఢిల్లీ: నిర్దిష్ట శాఖల్లో గడువులోగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయకపోతే... బ్యాంకులు ఒక్కో బ్రాంచీకి రూ.20,000 చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుందని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే హెచ్చరించారు. ఆదేశాల అమలు కోసం బ్యాంకులకు సెప్టెంబర్ 30 దాకా గడువు పొడిగించినట్లు తెలియజేశారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆగస్టు ఆఖరునాటికల్లా ప్రతి పది శాఖల్లో ఒక బ్రాంచీలోనైనా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేషన్ సెంటరును ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ జూలైలో ఆదేశించింది.
అయితే, బ్యాంకులు తమకు మరింత సమయం కావాలని కోరడంతో తాజాగా గడువు పొడిగించింది. ‘ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు మరికాస్త సమయం కావాలంటూ బ్యాంకులు కోరాయి. దీంతో సెప్టెంబర్ 30 దాకా గడువిచ్చాం. డెడ్‌లైన్ దాటితే సదుపాయం అందుబాటులోకి రాని ప్రతి బ్రాంచీపై ప్రతి నెలా రూ. 20,000 మేర బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది‘ అని పాండే వివరించారు. అంటే, 100 శాఖలు ఉన్న బ్యాంకు 10 శాఖల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అయితే, సెప్టెంబర్ 30లోగా ఉదాహరణకు అయిదు శాఖల్లో సెంటర్ అందుబాటులోకి రాని పక్షంలో ఆ అయిదింటిపైనా తొలి నెలలోనే రూ. 1 లక్ష మేర పెనాల్టీ కట్టాల్సి వస్తుంది (ప్రతి శాఖకు రూ. 20,000 చొప్పున). ఒకవేళ తదుపరి నెలల్లో కూడా మిగిలిన శాఖల్లో సెంటర్ ఏర్పాటు చేయని పక్షంలో ఒక్కో సెంటరుకు ప్రతి నెలా రూ. 20వేలు చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కస్టమర్లకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బ్యాంకుల్లోనే ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ భావించిందని పాండే చెప్పారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తామిచ్చిన వ్యవధి సరిపోగలదని తెలిపారు. బయోమెట్రిక్ డివైజ్‌లు మొదలైనవి సమకూర్చుకునే ప్రక్రియ ఇంకా జరుగుతోందని పలు బ్యాంకులు తెలిపినట్లు ఆయన చెప్పారు.