ప్రపంచ టొబాకో రంగంలో భారీ డీల్!
• బీఏటీ చేతికి రేనాల్డ్స్ అమెరికన్
• 49.4 బిలియన్ డాలర్ల ఒప్పందం
లండన్: ప్రపంచ టొబాకో పరిశ్రమలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా దిగ్గజం రేనాల్డ్స్ అమెరికన్‌ను చేజిక్కించుకున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం 49.4 బిలియన్ డాలర్లను(దాదాపు రూ.3.35 లక్షల కోట్లు) వెచ్చించేందుకు అంగీకరించింది. ఈ డీల్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో(సిగరెట్లు ఇతరత్రా పొగాకు ఉత్పత్తులు) కంపెనీ ఆవిర్భవిస్తోందని బీఏటీ పేర్కొంది. నగదు, షేర్ల రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని తెలిపింది. గతంలో ఆఫర్ చేసిన 47 బిలియన్ డాలర్ల మొత్తాన్ని రేనాల్డ్స్ అమెరికన్ తిరస్కరించడంతో డీల్ విలువను బీఏటీ పెంచింది. తాజా డీల్ ప్రకారం రేనాల్డ్స్ వాటాదారులు తమ ఒక్కో షేరుకు 29.44 డాలర్ల నగదును, 0.5260 బ్యాట్ సాధారణ షేర్లను అందుకుంటారు. మొత్తంమీద ఈ ఆఫర్ కింద బీఏటీ 25 బిలియన్ డాలర్ల నగదు, 24.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను రేనాల్డ్స్ వాటాదారులకు ఇస్తోంది. దీంతో రేనాల్డ్స్ గ్రూప్ విలువ 85 బిలియన్ డాలర్లకు పైగానే లెక్కతేలుతోంది.
ఏకమవుతున్న గ్లోబల్ బ్రాండ్స్...
బీఏటీ, రేనాల్డ్స్ డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా పేర్కొందిన టొబాకో బ్రాండ్‌లు ఒకే గూటికి చేరనున్నాయి. ఇందులో బ్యాట్ ఉత్పత్తులైన లక్కీ స్ట్రైక్, రోత్‌మన్స్, కెంట్... రేనాల్డ్స్ బ్రాండ్‌లు న్యూపోర్ట్, కేమెల్, పాల్‌మాల్ ఉన్నాయి. కొనుగోలు తర్వాత ఆవిర్భవించే కంపెనీకి అమెరికాలో పటిష్టమైన మార్కెట్‌తో పాటు భారీగా వృద్ధి అవకాశాలున్న దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో గణనీయమైన మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. ‘‘రేనాల్డ్స్‌తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది.
ఈ–సిగరెట్స్ లేదా వ్యాపింగ్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న కొత్త తరం ఉత్పత్తులకు సంబంధించి సిసలైన ప్రపంచ వ్యాపారాన్ని సృష్టించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుంది’ అని బీఏటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నికాండ్రో డ్యురాంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ వాటా ప్రకారం చూస్తే చైనా నేషనల్ టొబాకో కార్పొరేషన్ ప్రపంచంలో అతిపెద్ద సిగరెట్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది. తర్వాత స్థానంలో మాల్‌బ్రో బ్రాండ్ తయారీ కంపెనీ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ ఉంది. అయితే, రేనాల్డ్స్ కొనుగోలుతో నికర టర్నోవర్, నిర్వహణ లాభం పరంగా తమదే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో కంపెనీగా ఆవిర్భవిస్తుందని బీఏటీ చెబుతోంది.