ముందే ఆరంభిస్తే మంచిది..
వీలైనంత త్వరగా ప్లానింగ్ ప్రారంభించండి
మీ ప్లానింగ్ అన్ని అవసరాలను తీర్చగలగాలి
ఆదాయ పన్ను నిబంధనలు తెలుసుకోండి
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేయండి
రిటైర్‌మెంట్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఉద్యోగస్తులందరికీ రిటైర్‌మెంట్ తప్పదు. ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో ఎన్నోకలలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఇలా ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న వారికి, వారి జీవితాన్ని సంతోషంగా జీవించడానికి అవసరమైన విశ్రాంతి సమయం రిటైర్‌మెంట్ తర్వాతే దొరుకుతుంది. రిటైర్‌మెంట్ అనంతర జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, దానికి అనువైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి రిటైర్‌మెంట్ ప్లానింగ్ తప్పనిసరి. రిటైర్‌మెంట్ ప్లానింగ్ సమయంలో ఈ విషయాలను గుర్తించుకోండి!
ముందే ప్లానింగ్ చేయండి...
రిటైర్‌మెంట్ ప్లానింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? అనే ప్రశ్న సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది. రిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో అత్యంత ప్రధానమైన అంశం.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లానింగ్‌ను ప్రారంభించడం. అంటే సంపాదన ప్రారంభించిన తొలినాళ్ల నుంచే రిటైర్‌మెంట్ ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ త్వరగా ప్రారంభిస్తే రిటైర్‌మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతిలో ఉంటాయి.
ఆదాయ పన్ను సంగతేంటి...
ఏ ఆర్థిక ప్రణాళికల్లోనైనా ఆదాయ పన్ను(ఐటీ) నిర్వహణ చాలా ముఖ్యమైన అంశం. అలాగే రిటైర్‌మెంట్ ప్లానింగ్‌కు ఆదాయ పన్నుతో సంబంధం ఉంటుంది. రిటైర్‌మెంట్ కోసం ఇన్వెస్ట్‌చేసే మొత్తానికి ప్రస్తుతం మనం ఒక నిర్ణీత పరిధి వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రిటైర్‌మెంట్ తీసుకున్న సమయంలో పొందే వార్షిక మొత్తంపై మాత్రం పన్ను చెల్లించాలి. రిటైర్‌మెంట్ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు.. తప్పకుండా ఆదాయ పన్ను నిబంధనల గురించి తెలుసుకోవాలి.
ఆరోగ్యం కూడా ముఖ్యం
ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఆరోగ్యకరంగా లేవు. పర్యావరణం కలుషితమౌతోంది.. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. అందువల్ల వాటికి వెచ్చించే వ్యయం కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
లక్ష్యాలను నిర్దేశించుకోండి
రిటైర్‌మెంట్ ప్లానింగ్ సమయంలో మీరు రిటైర్‌మెంట్ అనంతర కాలంలో ఎలాంటి వ్యయాలు ఉంటాయో ముందుగానే ఆలోచించి, ఒక నిర్ణయానికి రావాలి. అంటే కూతురి పెళ్లి, పిల్లల చదువు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు వంటి అంశాలు. వీటిని ముందుగానే అంచనా వేస్తే రిటైర్‌మెంట్ సమయంలో ఎంత సొమ్ము అవసరమౌతుందో తెలుస్తుంది.
రిటైర్‌మెంట్ ప్లాన్ ఎంపికలో జాగ్రత్త వహించండి
రిటైర్‌మెంట్ తర్వాత ఆనందంగా జీవించాలంటే ఆర్థిక స్వాతంత్య్రత ఉండాలి. రిటైర్‌మెంట్ ప్లాన్ ఎంపికలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎంపిక చేసుకోవాలని భావించే రిటైర్‌మెంట్ ప్లాన్ మీ అవసరాలన్నింటినీ తీర్చగలిగేలా ఉండాలి. రిటైర్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్‌చేసే ముందు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించి, వారి సలహాలను తీసుకోవడం మంచిది.
ద్రవ్యోల్బణాన్ని మరువద్దు
మన జీవన వ్యయం పెరుగుతూనే ఉంటుంది. తగ్గే పరిస్థితి ఉండదు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని అశ్రద్ధ చేయవ ద్దు. రిటైర్‌మెంట్ సమయంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులను ఇప్పుడే అంచనా వేయాలి. సీనియర్ సిటిజన్లు ఆహార పదార్థాలపై వెచ్చించే వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ.. వారి మెడికల్ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.