న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ 2017 కల్లా భారత్ లో 100 యూనిట్ల పైగా కార్ల అమ్మకాలను నమోదుచేయాలని నిర్ణయించింది. గత నాలుగేళ్లలో ఈ కార్ల కంపెనీ అమ్మకాలు 15 శాతం వృద్ధిలో నడుస్తున్నాయని కంపెనీ పేర్కొంది. బెంట్లీ కంపెనీకి భారత్‌లో డీలర్‌గా వ్యవహరిస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. ఈ ఏడాది కూడా ఈ కంపెనీ అమ్మకాలు ఇలానే నమోదవుతాయనే ఆశాభావం వ్యక్తంచేసింది. భారత్ లో ఈ అమ్మకాలను ప్రతి ఏడాది15 శాతం పెంచుకుంటూ పోతామని, గత అమ్మకాలకు రెండింతలు నమోదుచేస్తామని ఎక్స్ క్లూజివ్ మోటార్స్ తెలిపింది. 2017 వచ్చే సరికి మూడంకెల సంఖ్యకు కంపెనీ అమ్మకాలు చేరుకుంటాయని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా చెప్పారు.
తాజాగా మార్కెట్లోకి విడుదలచేసిన తొలి అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్ యూవీ బెంటెగా ధర రూ.3.85 కోట్లగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉందని, ఈ కారు బుకింగ్స్ కచ్చితంగా మూడు అంకెలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో బెంట్లీ కంపెనీ బెంటెగా మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా 2,600-2,700 యూనిట్ల వరకూ ఉత్పత్తిచేస్తుంది. వచ్చే ఏడాదికల్లా వీటి ఉత్పత్తి 3,000 యూనిట్లకు చేరుకోవాలని కంపెనీ ఆశిస్తుంది. గతేడాది ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 10,001 యూనిట్ల లగ్జరీ కార్లను ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది వీటి ఉత్పత్తి 15 శాతం పెరుగనుందని కంపెనీ తెలిపింది. గ్లోబల్ గా ఈ కార్లకు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. కంపెనీ తన లగ్జరీ సెడాన్స్ కాంటినెంటల్ జీటీ, ఫ్లైయింగ్ స్పర్ కార్లు రూ.3.55 కోట్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.