
భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ
డీల్ విలువ రూ.95 కోట్లు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూఎఫ్‌టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు)కొనుగోలు చేయనున్నది. వాహన, ఇతర పారిశ్రామిక విభాగాల్లో తన ఉత్పత్తులను మరింతగా పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని భారత్ ఫోర్జ్ కొనుగోలు చేయనున్నది. తమ అమెరికా అనుబంధ కంపెనీ భారత్ ఫోర్జ్ అమెరికా ద్వారా డబ్ల్యూఎఫ్‌టీని కొనుగోలు చేయనున్నామని భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలును తమ ఫైనాన్‌స అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమోదించిందని భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా ఎన్. కల్యాణి చెప్పారు. ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. డబ్ల్యూఎఫ్‌టీ కంపెనీ ఈ ఏడాది 2.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా.