న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో భారతీ ఎయిర్‌టెల్ రూ.260 కోట్లు, భారతీ ఎంటర్‌ప్రైజెస్ రూ.65 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ, టోఫ్లర్ తెలిపింది. కాగా ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు పెట్టుబడులు కొనసాగిస్తామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలందించడం, డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయని వివరించారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ అవుట్‌లెట్స్ 5 లక్షలకు చేరాయని, మంచి వృద్ధి సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిటైల్ బ్యాంకింగ్ పాయింట్స్ ద్వారా భారతీ ఆక్సా లైఫ్ పాస్ సరళ్ జీవన్ బీమా యోజన టర్మ్ పాలసీని విక్రయించనున్నామని తెలిపారు. ఈ మేరకు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షల పాలసీలను ఎంచుకోవచ్చని, వీటికి ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment