డౌన్‌లోడ్ స్పీడ్.. ఎయిర్‌టెల్ టాప్..
న్యూఢిల్లీ: డౌన్‌లోడ్ స్పీడ్ అంశంలో ఎయిర్‌టెల్ తన దూకుడును కొనసాగి స్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సగటున సెకనుకు 8.42 మెగాబైట్స్‌గా (8.42 ఎంబీపీఎస్) నమోదయ్యింది. కాగా గతేడాది డిసెంబర్‌లో ఇదే కంపెనీ డౌన్‌లోడ్ స్పీడ్ 4.68 ఎంబీపీఎస్‌గా ఉంది. అంటే నెల ప్రాతిపదికన చూస్తే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ దాదాపు రెట్టింపు అయ్యింది.
ఇక రిలయన్స్ జియో విషయానికి వస్తే.. ఈ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ అనూహ్యంగా 8.34 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది. డిసెంబర్‌లో దీని డౌన్‌లోడ్ స్పీడ్ గరిష్టంగా 18.14 ఎంబీపీఎస్‌గా నమోదు కావడం గమనార్హం. అంటే నెలవారీగా చూస్తే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సగానికిపైగా క్షీణించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చూస్తే ఎయిర్‌టెల్ మూడు సార్లు డౌన్‌లోడ్ స్పీడ్ అంశంలో అగ్రస్థానంలో నిలిచింది.