
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) 2016–17లో మొత్తం 79 శాతం మేర డివిడెండ్ చెల్లించింది. తొలి విడతగా 40 శాతం, మలివిడతలో 39 శాతం చెల్లించింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని, గతేడాది చెల్లించిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని భెల్ తెలిపింది. దీంతో నాలుగు దశాబ్దాల నుంచి నిరాటంకంగా ఇన్వెస్టర్లకు డివిడెండ్లు అందిస్తున్న సంస్థగా నిల్చింది.
విలువపరంగా చూస్తే 2016–17లో భెల్ మొత్తం మీద రూ. 386.72 కోట్లు, కేంద్రానికి రూ.244 కోట్లు డివిడెండ్ చెల్లించినట్లయింది. మలి విడతకు సంబంధించి రూ.120.39 కోట్ల చెక్కును భెల్ సీఎండీ అతుల్ సోబ్ది.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ జి. గీతేకి బుధవారం అందించారు.