
బిల్‌గేట్స్ నుంచి భారీగా కానుకలు.. ఊహించడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా..! అయితే నిజంగా ఆయన నుంచి కానుకలు వస్తే.. ఒక్క దగ్గర ఆగుతామా! ఎగిరి గంతేస్తాం. ప్రస్తుతం 'రెడిట్ సీక్రెట్ శాంతా' గేమ్‌లో పాల్గొన్న వియెట్టే ఎల్‌ఎల్‌సీ అనే యువతి అదే చేస్తున్నారు. క్రిస్మస్ నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ఆమె ఇంటికి పెద్దఎత్తున కానుకలు పంపించారు. ఈ కానుకలు చూడగానే ఆమె ఆనందం అవధులు దాటింది. వియెట్టే ఎల్‌ఎల్‌సీ, బిల్‌గేట్స్ నుంచి అందుకున్న కానుకలతో పాటు ఓ హృదయపూర్వకమైన పోస్టును షేర్ చేసింది. ఆ ఆనందం ఎలాంటిదో తన మనసుకే తెలుసని.. ఇకపై క్రిస్మస్‌ను తాను బిల్‌గేట్స్‌కు ముందు, తర్వాత అని జరుపుకొంటానని పేర్కొన్నారు. తాను చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పిల్లులంటే అమితంగా ఇష్టపడే వియెట్టే అభిరుచులకు అనుగుణంగా బిల్‌గేట్స్ డజనుకు పైగా కానుకలు పంపించారు. అందులో పెద్ద పుషీన్ (కార్టూన్ పిల్లి) బొమ్మతో పాటు, జంతు సంరక్షణకు 750 డాలర్ల విరాళం, టీషర్టు, పలు పుస్తకాలు, పిల్లులను పెంచేపెట్టె వంటివి ఉన్నాయి. అలాగే తన ఫోటో, ఓ లేఖను కూడా బిల్‌గేట్స్ పంపించారు. అందులో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద బాక్స్ రావడం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని, బిల్‌గేట్స్ నుంచి రావడం తన ఆనందానికి అవధులు లేకుండా చేసిందన్నారు. బిల్‌గేట్స్‌కు తన ఆత్మ కచ్చితంగా తెలిసిందని చెప్పారు. ప్రఖ్యాత రెడిట్ వెబ్‌సైట్ సీక్రెట్ శాంతా పేరుతో.. తన ఖాతాదారులంతా ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకునేలా ఇలాంటి ఆన్‌లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గత కొన్నేళ్లుగా పాల్గొంటున్న బిల్‌గేట్స్, ఓ లక్కీ మహిళకు గిఫ్ట్‌లు పంపించారు.

Comments
Please login to add a commentAdd a comment