ఈటీఎఫ్‌లతో రిస్క్‌ తక్కువ | Birla Sun Life AMC plans bank ETF, to focus on existing funds | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌లతో రిస్క్‌ తక్కువ

Published Wed, Aug 30 2017 2:13 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

ఈటీఎఫ్‌లతో రిస్క్‌ తక్కువ

ఈటీఎఫ్‌లతో రిస్క్‌ తక్కువ

పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్లతో మంచి రాబడి
ఫండ్‌ ఖర్చులు తక్కువ కనక దీర్ఘకాలానికి బెటర్‌...
ఇండెక్స్‌ల రూపకల్పనలోకఠిన నియమాలు
తాజాగా స్మార్ట్‌బీటా పేరిటవోలటాలిటీ ఇండెక్స్‌ కూడా...
ఏసియా ఇండెక్స్‌ సంస్థ బిజినెస్‌ హెడ్‌ కోయల్‌ ఘోష్‌ వ్యాఖ్యలు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టాక్‌ మార్కెట్లలో సహజమైన ఊగిసలాటల నుంచి ఇన్వెస్టర్లను రక్షించడానికి ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌) ఉపకరిస్తాయని ఏసియా ఇండెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దక్షిణాసియా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ కోయల్‌ ఘోష్‌ చెప్పారు. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌ అండ్‌ పీ) డౌజోన్స్, బోంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీ సమాన భాగస్వాములుగా నాలుగేళ్ల కిందట ఈ ఏసియా ఇండెక్స్‌ సంస్థ ఏర్పాటయింది. ‘‘ఈక్విటీలు, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, కమాడిటీస్, రియల్‌ ఎస్టేట్‌ వంటి వివిధ రకాల ఆస్తులు, థీమ్‌ల ఆధారంగా ఇండెక్స్‌లు రూపొందిస్తున్నాం. వీటి రూపకల్పనలో ఖచ్చితమైన అంతర్గత నియమావళిని, వ్యవస్థాగత ప్రామాణిక ప్రక్రియల్ని పాటిస్తున్నాం.

 ఒకరకంగా చెప్పాలంటే ఇవి యాక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్లకన్నా పరోక్ష (పాసివ్‌) ఇన్వెస్ట్‌మెంట్లకు అనుకూలమైనవి’’ అని ఈ సందర్భంగా కోయల్‌ తెలియజేశారు. ఇండెక్స్‌లకు సంబంధించి ఇండియాలో 2005లో కేవలం 6 ఉత్పత్తులే అందుబాటులో ఉండేవని, ఇపుడు వాటి సంఖ్య ఏకంగా 65కు చేరిందని, వీటి విలువ 5 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని తెలియజేశారు. అంటే ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ 100, ఎస్‌ అండ్‌ పీ– బీఎస్‌ఈ 500 తదితర ఇండెక్స్‌లన్న మాట. వీటిలో సెక్టార్ల వారీ ఫండ్లు కూడా ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెన్షన్‌ ఫండ్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు కోయల్‌ చెప్పారు.

 ఇండియాలోనూ ఈ ట్రెండ్‌ పెరుగుతోందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసంప్రారంభించిన భారత్‌–22 ఈటీఎఫ్‌ను ఆమె ఉదహరించారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ఆరంభించనుందని చెబుతూ...  ‘‘గతంలో కేంద్రం ఆవిష్కరించిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కన్నా తాజా భారత్‌– 22 మెరుగైనదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ నవరత్న, మినీరత్న సంస్థలున్నాయి’’ అని చెప్పారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆవిష్కరించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే...
ప్రత్యక్ష, పరోక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాల మధ్య తేడాల్ని కోయల్‌ ఘోష్‌ వివరిస్తూ... ‘‘యాక్టివ్‌ ఇన్వెస్టింగ్‌ విధానంలో ఇన్వెస్టరు లేదా ఫండ్‌ మేనేజరు తానే షేర్లను ఎంచుకుంటారు. తన సమర్థతనే నమ్ముకుంటారు. అనలిస్టుల అంచనాలు, స్టోరీలు, వార్తలు, వదంతుల ఆధారంగా తన ఇన్వెస్ట్‌మెంట్లను మారుస్తుంటారు. పాసివ్‌ విధానంలో అలా కాదు. ఇన్వెస్టర్లు మార్కెట్‌నో, మార్కెట్‌ను ప్రతిబింబించే ఒక ఇండెక్స్‌నో ఎంచుకుంటారు. అందులో ఇన్వెస్ట్‌ చేయటం ద్వారా మార్కెట్‌ వృద్ధిలో భాగస్వాములవుతారు’’ అని వివరించారు.

 తరచు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా... ఆ ఖర్చు కూడా మిగిలేలా సుదీర్ఘకాలంపాటు ఇండెక్స్‌లలో ఇన్వెస్ట్‌ చేయటాన్నే పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తున్నట్లు కోయల్‌ తెలియజేశారు. పాసివ్‌ ఇన్వెస్టింగ్‌ విధానంలో ఇండెక్స్‌ల పనితీరును పోలుస్తూ... ఈ ఏడాది పాసివ్‌ విధానం ద్వారా వచ్చిన రాబడులు దాదాపు 66 శాతం యాక్టివ్‌ ఫండ్లకన్నా మెరుగ్గా ఉన్నాయని కోయల్‌ చెప్పారు. ఖర్చులు కూడా మ్యూచ్‌వల్‌ ఫండ్లలో 1.25 నుంచి 2.25 శాతం వరకూ ఉంటే... ఈటీఎఫ్‌లలో 0.3 శాతమే ఉంటాయని తెలిపారు.

 ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్‌ పరిణామాలకు అనుగుణంగా ఆయా ఇండెక్స్‌లలోని షేర్లను కూడా మారుస్తున్నామని, ఇలా మార్చటానికి కఠినమైన నియమాలతో పాటు పారదర్శక కమిటీ కూడా ఉందని తెలియజేశారు. ‘‘తాజాగా హెచ్చుతగ్గుల ఇండెక్స్‌ను రూపొందించాం. స్మార్ట్‌బీటాగా వ్యవహరించే ఈ హెచ్చుతగ్గుల ఇండెక్స్‌లో భారీగా ఒడిదుడుకులకు గురికాని షేర్లుంటాయి. అంటే మార్కెట్‌ బాగా పెరిగిన సందర్భాల్లో కూడా ఇవి తక్కువే పెరుగుతాయి.

అలాగే మార్కెట్‌ బాగా పడినపుడు ఇవి తక్కువే పడతాయి. వీటిలో రిస్క్‌ తక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలనిస్తాయి’’ అని వివరించారు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులపై ఇండియాలో ఇపుడిపుడే ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉందని చెబుతూ... ఎప్పటికప్పుడు ఇండెక్స్‌లలోని షేర్లు మారుతుంటాయి కనక చక్కని రాబడుల కోసం ఈటీఎఫ్‌లు మంచివేనని కోయల్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement