Passive Investments
-
ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీ
ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) నిబంధనల కార్యాచరణను ప్రకటించింది. ప్యాసివ్ ఫండ్స్ విభాగంలో కొత్త సంస్థల ప్రవేశాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల వైవిధ్యాన్ని విస్తృతం చేయడమనే లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) సహా ప్యాసివ్ పథకాలకు ఈ కార్యాచరణ అమలవుతుందని సెబీ తెలిపింది.ప్యాసివ్ ఫండ్స్‌ను మాత్రమే నిర్వహించే సంస్థలకు అవరోధాలను తొలగించడం, మార్కెట్లో లిక్విడిటీని పెంచడం, కొత్త సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం ఇందులో లక్ష్యాలని పేర్కొంది. ఎంఎఫ్ లైట్ నిబంధనలు 2025 మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ సైతం ఎంఎఫ్ లైట్ సంస్థలకు మద్దతుగా (స్పాన్సర్) నిలవొచ్చని ప్రకటించింది. కాకపోతే కీలక స్థానాల్లోని ఉద్యోగులకు 20 ఏళ్ల అనుభవాన్ని అర్హతగా ఖరారు చేసింది. స్పానర్లకు సంబంధించి భిన్నమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. ఎంఎఫ్ లైట్ కార్యాచరణ తొలుత దేశీ ఈక్విటీ సూచీల ఆధారిత ప్యాసివ్ ఫండ్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అందించే ప్రస్తుత సంస్థలు సైతం నూతన కార్యాచరణ కింద తమ ప్యాసివ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను వేరొక సంస్థ కింద నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?ఏమిటీ ఫ్యాసివ్ ఫండ్స్?నిఫ్టీ 50 లేదా ఎస్ అండ్ పీ 500 వంటి ఒక నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిబింబించడానికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలే ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్ల(ప్రత్యేకంగా ఫండ్ మేనేజర్ ఉండే మ్యుచువల్ ఫండ్స్) మాదిరిగా కాకుండా, ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్‌ను అనుసరిస్తాయి. వీటికి ఎక్కువగా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు. కాబట్టి కొంత యాక్టివ్ ఫండ్లతో పోలిస్తే రాబడులు మారవచ్చు. ఇది ఇండెక్స్‌ను అనుసరిస్తూ ఆయా విభాగాల్లోని మెరుగైన స్టాక్లను కలిగి ఉంటాయి. దాంతో డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! -
ఈటీఎఫ్‌లతో రిస్క్ తక్కువ
♦ పాసివ్ ఇన్వెస్ట్మెంట్లతో మంచి రాబడి ♦ ఫండ్ ఖర్చులు తక్కువ కనక దీర్ఘకాలానికి బెటర్... ♦ ఇండెక్స్‌ల రూపకల్పనలోకఠిన నియమాలు ♦ తాజాగా స్మార్ట్బీటా పేరిటవోలటాలిటీ ఇండెక్స్ కూడా... ♦ ఏసియా ఇండెక్స్ సంస్థ బిజినెస్ హెడ్ కోయల్ ఘోష్ వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో సహజమైన ఊగిసలాటల నుంచి ఇన్వెస్టర్లను రక్షించడానికి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఉపకరిస్తాయని ఏసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణాసియా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ కోయల్ ఘోష్ చెప్పారు. స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) డౌజోన్స్, బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ సమాన భాగస్వాములుగా నాలుగేళ్ల కిందట ఈ ఏసియా ఇండెక్స్ సంస్థ ఏర్పాటయింది. ‘‘ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్, కమాడిటీస్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తులు, థీమ్‌ల ఆధారంగా ఇండెక్స్‌లు రూపొందిస్తున్నాం. వీటి రూపకల్పనలో ఖచ్చితమైన అంతర్గత నియమావళిని, వ్యవస్థాగత ప్రామాణిక ప్రక్రియల్ని పాటిస్తున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇవి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లకన్నా పరోక్ష (పాసివ్) ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలమైనవి’’ అని ఈ సందర్భంగా కోయల్ తెలియజేశారు. ఇండెక్స్‌లకు సంబంధించి ఇండియాలో 2005లో కేవలం 6 ఉత్పత్తులే అందుబాటులో ఉండేవని, ఇపుడు వాటి సంఖ్య ఏకంగా 65కు చేరిందని, వీటి విలువ 5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని తెలియజేశారు. అంటే ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100, ఎస్ అండ్ పీ– బీఎస్ఈ 500 తదితర ఇండెక్స్లన్న మాట. వీటిలో సెక్టార్ల వారీ ఫండ్లు కూడా ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెన్షన్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కోయల్ చెప్పారు. ఇండియాలోనూ ఈ ట్రెండ్ పెరుగుతోందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ కోసంప్రారంభించిన భారత్–22 ఈటీఎఫ్‌ను ఆమె ఉదహరించారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ఆరంభించనుందని చెబుతూ... ‘‘గతంలో కేంద్రం ఆవిష్కరించిన సీపీఎస్ఈ ఈటీఎఫ్కన్నా తాజా భారత్– 22 మెరుగైనదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ నవరత్న, మినీరత్న సంస్థలున్నాయి’’ అని చెప్పారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆవిష్కరించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే... ప్రత్యక్ష, పరోక్ష ఇన్వెస్ట్మెంట్ విధానాల మధ్య తేడాల్ని కోయల్ ఘోష్ వివరిస్తూ... ‘‘యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇన్వెస్టరు లేదా ఫండ్ మేనేజరు తానే షేర్లను ఎంచుకుంటారు. తన సమర్థతనే నమ్ముకుంటారు. అనలిస్టుల అంచనాలు, స్టోరీలు, వార్తలు, వదంతుల ఆధారంగా తన ఇన్వెస్ట్మెంట్లను మారుస్తుంటారు. పాసివ్ విధానంలో అలా కాదు. ఇన్వెస్టర్లు మార్కెట్‌నో, మార్కెట్‌ను ప్రతిబింబించే ఒక ఇండెక్స్నో ఎంచుకుంటారు. అందులో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములవుతారు’’ అని వివరించారు. తరచు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా... ఆ ఖర్చు కూడా మిగిలేలా సుదీర్ఘకాలంపాటు ఇండెక్స్‌లలో ఇన్వెస్ట్ చేయటాన్నే పాసివ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తున్నట్లు కోయల్ తెలియజేశారు. పాసివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇండెక్స్‌ల పనితీరును పోలుస్తూ... ఈ ఏడాది పాసివ్ విధానం ద్వారా వచ్చిన రాబడులు దాదాపు 66 శాతం యాక్టివ్ ఫండ్లకన్నా మెరుగ్గా ఉన్నాయని కోయల్ చెప్పారు. ఖర్చులు కూడా మ్యూచ్‌వల్ ఫండ్లలో 1.25 నుంచి 2.25 శాతం వరకూ ఉంటే... ఈటీఎఫ్‌లలో 0.3 శాతమే ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ఆయా ఇండెక్స్‌లలోని షేర్లను కూడా మారుస్తున్నామని, ఇలా మార్చటానికి కఠినమైన నియమాలతో పాటు పారదర్శక కమిటీ కూడా ఉందని తెలియజేశారు. ‘‘తాజాగా హెచ్చుతగ్గుల ఇండెక్స్‌ను రూపొందించాం. స్మార్ట్బీటాగా వ్యవహరించే ఈ హెచ్చుతగ్గుల ఇండెక్స్‌లో భారీగా ఒడిదుడుకులకు గురికాని షేర్లుంటాయి. అంటే మార్కెట్ బాగా పెరిగిన సందర్భాల్లో కూడా ఇవి తక్కువే పెరుగుతాయి. అలాగే మార్కెట్ బాగా పడినపుడు ఇవి తక్కువే పడతాయి. వీటిలో రిస్క్ తక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలనిస్తాయి’’ అని వివరించారు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులపై ఇండియాలో ఇపుడిపుడే ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉందని చెబుతూ... ఎప్పటికప్పుడు ఇండెక్స్‌లలోని షేర్లు మారుతుంటాయి కనక చక్కని రాబడుల కోసం ఈటీఎఫ్‌లు మంచివేనని కోయల్ చెప్పారు.