నల్లధనంపై ఐటీ కఠిన చర్యలు
న్యూఢిల్లీ: నల్లధనం కేసుల్లో విచారణను ఆదాయపన్ను శాఖ వేగవంతం చేసింది. జనవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతలకు సంబంధించిన కేసుల్లో 570 చార్జ్‌షీట్లను దాఖలు చేసింది. ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమంలో గుర్తించిన భారీ డిపాజిట్లకు సంబంధించి తీవ్రమైన అవకతవకలు జరిగిన కేసులను విడిచిపెట్టవద్దని... ఆయా సంస్థలు, వ్యక్తులపై కోర్టుల్లో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఆదేశాలందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలకు సంబంధించి కోర్టుల్లో దాఖలైన చార్జ్‌షీట్లు 196 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే అవి మూడు రెట్లు పెరిగి 570కు చేరాయి.
ఆదాయపన్ను చట్టం కింద పన్ను నేరాల్లో కోర్టు దోషిగా నిర్ధారిస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో దాఖలు చేసిన 570 కేసుల్లో అధిక శాతం సెక్షన్ 276 సీఈ (ఆదాయ రిటర్నులు దాఖలు చేయకపోవడం), సెక్షన్ 276బీ (టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోవడం), సెక్షన్ 276సీ(1) (ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత) కింద ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు జాబితా, ఐసీఐజే, పనామా పేపర్లలో ఉన్న వారి కేసులూ ఇందులో ఉన్నాయి. ఇక, పన్ను ఎగవేతలకు పాల్పడిన వారి నుంచి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ కోరుతూ 1,195 దరఖాస్తులు ఆదాయపన్ను శాఖకు వచ్చాయి.