ఏపీలో బ్లూ స్టార్ ఏసీల ప్లాంటు! | blue star ac plant in ap | Sakshi
Sakshi News home page

ఏపీలో బ్లూ స్టార్ ఏసీల ప్లాంటు!

Published Thu, Dec 3 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ఏపీలో బ్లూ స్టార్ ఏసీల ప్లాంటు!

ఏపీలో బ్లూ స్టార్ ఏసీల ప్లాంటు!

కొద్ది రోజుల్లో బోర్డు ఆమోదం
 ఉత్తరాదిన మరో యూనిట్
 రెండు ప్లాంట్లకు రూ.150 కోట్లు
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఏసీల తయారీలో ఉన్న బ్లూస్టార్ దక్షిణాది ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లా తడ వద్ద ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ ప్రయోజనాలు ఉండడమే ఇందుకు కారణం. తడ యూనిట్ విషయమై కంపెనీ కొద్ది రోజుల్లో బోర్డు ఆమోదం పొందనుందని విశ్వసనీయ వర్గాలు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించాయి.
 
  బ్లూస్టార్‌కు ఉన్న అయిదు ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాలకై కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. జీఎస్‌టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఉండవు. పైగా రవాణాకు ఏటా రూ.150 కోట్లదాకా ఖర్చవుతోంది. దక్షిణాది ప్లాంటుతో 60-65 శాతం వ్యయాలు ఆదా అవుతాయని బ్లూస్టార్ భావిస్తోంది.
 
 ముందుగా ఉత్తరాదిన..
 కంపెనీ ఉత్తరాదిన మరో ప్లాంటును స్థాపించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. 2017 ఏప్రిల్ కల్లా ఈ ప్లాంటును సిద్ధం చేయాలని బ్లూస్టార్ కృతనిశ్చయంతో ఉంది. ఇక దక్షిణాది ప్లాంటు 2018 మార్చికల్లా పూర్తి అవుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 30-40 ఎకరాల్లో రానున్న ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 5 లక్షల యూనిట్లు.
 
 ప్రతి ప్లాంటుకు కంపెనీ తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించనుంది. రెండు ప్లాంట్ల ద్వారా 700 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దక్షిణాది ప్లాంటును ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ పావులు కదుపుతోంది. సంస్థ అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే.
 
 2016లో 20 కొత్త మోడళ్లు..
 గత ఏడాది బ్లూస్టార్ సుమారు 3 లక్షల యూనిట్లను దేశీయంగా విక్రయించింది. 2015లో 3.4 లక్షల యూనిట్లు దాటాయి. మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీల వాటా ప్రస్తుతం 10 శాతముంది. విద్యుత్‌ను ఆదా చేసే ఈ ఏసీల పట్ల కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో 2016లో ఈ విభాగం 15 శాతానికి చేరుతుందని బ్లూస్టార్ భావిస్తోంది. 2015లో 20 రకాల ఇన్వర్టర్ ఏసీలను కంపెనీ ప్రవేశపెట్టింది. 2016లోనూ ఇదే స్థాయిలో మోడళ్లను విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్య, ఆఫ్రికాతోపాటు పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఏసీలను ఎగుమతి చేస్తోంది. కొత్త దేశాల్లో అడుగు పెట్టడంతోపాటు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement