హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ ఈ వేసవి సీజన్ కోసం 100 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే 40 ఇన్వర్టర్ ఏసీ మోడళ్లున్నాయి. జపాన్ యూనివర్సిటీలు, నిపుణులతో కలసి కొన్ని మోడళ్లకు రూపకల్పన చేసినట్లు కంపెనీ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘ఇవి 30 శాతం అదనంగా చల్లదనాన్నివ్వటంతో పాటు కంప్రెషర్ నుంచి శబ్దాన్ని నియంత్రిస్తాయి. 80 శాతం గాలిని శుభ్రపరుస్తాయి. 150 మంది ఆర్ అండ్ డీ సిబ్బంది ఈ మోడళ్ల డిజైన్‌లో నిమగ్నమయ్యారు. ఏటా పరిశోధనకు రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని తెలిపారు. నాలుగు రకాల స్మార్ట్ ఏసీలను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. సంస్థకు దేశవ్యాప్తంగా 150 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. మరో 50 కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేయనుంది.
పరిశ్రమను మించి..
భారత ఏసీల విపణిలో ఏటా 55 లక్షల యూనిట్ల రూమ్ ఏసీలు అమ్ముడవుతున్నాయి. 2020 నాటికి ఇది కోటి యూనిట్లకు ఎగబాకనుంది. పరిశ్రమ 2018లో 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది. బ్లూ స్టార్ మాత్రం 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. 2016–17లో కంపెనీ రూ.4,400 కోట్ల టర్నోవర్ సాధించింది. సంస్థకు 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది ఇది 12.5 శాతానికి చేరుతుందని త్యాగరాజన్ ధీమా వ్యక్తంచేశారు.
ప్రోత్సాహకాలపై జమ్మూకశ్మీర్ స్పష్టత ఇవ్వనందున ఆ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు యోచన విరమించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో 2019లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా ఈ ప్లాంటుకు రూ.200 కోట్లు వెచ్చిస్తామని, వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment