బ్లూస్టార్ కొత్త శ్రేణి ఏసీలు
⇒ హైదరాబాద్ మార్కెట్‌లోకి విడుదల
⇒ 12.5% వాటా లక్ష్యం: కంపెనీ జేఎండీ త్యాగరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ బ్లూ స్టార్ హైదరాబాద్ మార్కెట్లో నూతన శ్రేణి మోడళ్లను మంగళవారం ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.35,000 ఉంది. చల్లదనాన్ని డెసిమల్స్‌లో (0.1) సర్దుబాటు చేసుకునే ఫీచర్‌తోనూ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీని కంపెనీ రూపొం దించింది. దేశంలో తొలిసారిగా ఈ ఫీచర్‌తో ఏసీలను తయారు చేశామని బ్లూ స్టార్ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ చెప్పారు. కావాల్సిన స్థాయిలో చల్లదనం అందించడంతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్లతో కూడిన ఏసీలను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుతం కంపెనీ 135 మోడళ్లను విక్రయిస్తోంది.
2020 నాటికి రెండు రెట్లు..
దేశవ్యాప్తంగా రూమ్ ఏసీ విభాగంలో అన్ని కంపెనీలు కలిపి 50 లక్షల ఏసీలు అమ్ముతున్నాయి. 2020 ఏడాది నాటికి మార్కెట్ రెండింతలు అవుతుందని బ్లూ స్టార్ అంచనా వేస్తోంది. రూమ్ ఏసీల రంగంలో కంపెనీకి 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. 2017–18లో 12.5 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు త్యాగరాజన్ వెల్లడించారు. కాగా, పన్ను ప్రయోజనాల కోసమే జమ్ములో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ‘జూలైకల్లా స్పష్టత వస్తుంది. పన్ను ప్రయోజనాలు రాకపోతే జమ్మూలో ప్లాంటు ఏర్పాటు చేయబోం. ఇదే సమయంలో ముందుగా ప్రతిపాదిత శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో పన్ను ప్రయోజనాలు పొందుతున్న కంపెనీ ప్లాంట్లలో దేనినైనా విస్తరిస్తాం’ అని వివరించారు.