మీరు కోరినట్టే ఆభరణాల డిజైన్..
• టాప్-4లో తెలుగు రాష్ట్రాలు
• బ్లూస్టోన్.కామ్ సీవోవో అరవింద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో బంగారు, వజ్రాభరణాల కొనుగోళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్-4లో ఉన్నట్టు బ్లూస్టోన్.కామ్ తెలిపింది. తొలి మూడు స్థానాల్లో ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర నిలిచారుు. తెలుగు రాష్ట్రాల కస్టమర్లు చెవి రింగులు, ఉంగరాలు, పెండెంట్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారని కంపెనీ సీవోవో అరవింద్ సింఘాల్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. పిల్లల నగల కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయన్నారు.
తమ పోర్టల్ ద్వారా సగటు ఆభరణం ధర రూ.25-30 వేలు ఉందని చెప్పారు. రూ.17 లక్షల విలువైన డైమండ్ రింగ్, రూ.8 లక్షలు ఖరీదు చేసే నెక్లెస్‌ను సైతం తాము విక్రరుుంచామని వివరించారు. నెలకు 7,000 ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ఇందులో టాప్-6 నగరాల నుంచి 65 శాతం ఉంటాయన్నారు.
ప్రతి నెల 200 డిజైన్లు..
బ్లూస్టోన్.కామ్ ప్రతి నెల 200 డిజైన్లను ప్రవేశపెడుతోంది. కస్టమర్లు తమకు నచ్చినట్టుగా ఆభరణాలను డిజైన్ చేసుకోవచ్చు. కస్టమర్ కోరితే డిజైన్లను ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు కూడా. ఆర్డరు తీసుకున్న తర్వాతే సొంత ప్లాంటులో తయారీ చేపడుతున్నట్టు అరవింద్ వెల్లడించారు. ఆభరణాలకు అన్ని ధ్రువీకరణలు ఉన్నాయని, డెలివరీ వారం రోజుల్లో చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఆభరణాల విపణి రూ.500 కోట్లుందని చెప్పారు. 51 శాతం వాటాతో బ్లూస్టోన్ టాప్‌లో ఉందన్నారు. 100 శాతం వృద్ధి సాధించామని, టర్నోవరు 2018 నాటికి రూ.1,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు.