ముంబై: దేశంలో బంగారం స్పాట్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉండడంతో ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ రూపొందించేందుకు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందులో పరిశ్రమకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు. ‘‘ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.
ఇందులో బులియన్ ట్రేడర్లు, బ్యాంకర్లు, నియంత్రణ సంస్థలకు చెందిన వారికి చోటుంటుంది. కేంద్ర ప్రభుత్వం బంగారం స్పాట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సాయాన్ని ఈ కమిటీ అందిస్తుంది’’ అని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. ‘‘ఈ ఎజెండాను ఏ ఒక్క సంస్థో సొంతంగా నిర్వహించలేదు. సన్నిహిత సంప్రదింపులతోపాటు పరిశ్రమ వ్యాప్తంగా సహకారం, సమన్వయం అవసరం. అలాగే, మార్కెట్లో పాలుపంచుకునేవారు, నియంత్రణ సంస్థలను కూడా ఇందులో భాగం చేయాలి’’ అని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలియజేసింది.