blue print
-
సంస్కరణలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్‌గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు. ఇలాంటి పారదర్శక బడ్జెట్లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్) చెప్పారు. ట్యాక్స్‌పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
టాటా గ్రూప్ బ్యాటరీ బ్లూప్రింట్
న్యూఢిల్లీ: బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటుపై బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా వెల్లడించింది. దేశ, విదేశాలలో భవిష్యత్ సాంకేతికతలకు అనుగుణంగా మారే(ఫ్యూచర్ రెడీ) వ్యూహాలకు తెరతీయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. సీఐఐ బిజినస్ సదస్సు 2022లో ప్రసంగిస్తూ చంద్రశేఖరన్ ఇంకా పలు విషయాలు పేర్కొన్నారు. టాటా గ్రూప్ భారీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఉన్నట్లు తెలియజేశారు. గ్రూప్ స్థాయిలో కార్బన్ న్యూట్రల్‌గా ఆవిర్భవించే లక్ష్యాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తమకు కీలకమైన బిజినెస్‌లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసే బాటలో డిజిటల్, డేటా, ఏఐ తదితర సాంకేతికతలను సమీకృతం చేయనున్నట్లు వివరించారు. చదవండి: సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్! -
Prashant Kishor: టార్గెట్ 370! కాంగ్రెస్ ముందు పీకే బ్లూప్రింట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వరుస ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కాలూచెయ్యీ కూడదీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే నేతలతో వరుస భేటీలు జరుపుతూ వారి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కాంగ్రెస్ అధిష్టానం శనివారం కీలక సమావేశం జరిపింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా 370 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగాలని, మిగతా చోట్ల పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవస్థాగతంగా చేసుకోవాల్సిన మార్పుచేర్పులతో కూడిన బ్లూ ప్రింట్‌ను నేతల ముందు ప్రజెంట్ చేశారు. దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. పీకే సూచనల్లోని సాధ్యాసాధ్యలపై వారం రోజుల్లో తుది నివేదిక అందించాలని ఆదేశించారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పీకేను ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు సమాచారం. అందుకాయన సానుకూలంగా స్పందించారని, త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. పీకే ‘కలి’విడి’ వ్యూహం సోనియా–పీకే భేటీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్‌సింగ్, అంబికా సోని, అజయ్‌మాకెన్ కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పట్నుంచే దూకుడుగా సిద్ధం కావాలని పీకే చెప్పారు. ‘‘ఇందుకోసం 365 నుంచి 370 లోక్‌సభ స్థానాలపై పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. వాటిలో ఒంటరిగానే పోటీ చేయాలి. మిగతా చోట్ల గెలిచే పార్టీలతో స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిషాల్లో ఒంటరిగా బరిలో దిగాలి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో పొత్తులతో ముందుకు పోవాలి’’ అన్న సూచనలకు రాహుల్ సహా నేతలంతా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పీకే ప్రజెంట్ చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం సాధించే మార్గాలపై నిర్మాణాత్మక సూచనలు చేశారు. చదవండి: ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు ‘కమ్యూనికేషన్’ సమూలంగా మారాలి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధిష్టానానికి పీకే సూచించారు. ‘‘కమ్యూనికేషన్ విభాగంలో సమూల మార్పులు అవసరం. కమ్యునికేషన్ వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి’’ అని చెప్పడంతో పాటు కొత్త పంథాలో ప్రజలకు చేర్చే వ్యూహాలనూ వివరించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా సోనియా సహా ముఖ్య నేతలంతా ఈ సందర్భంగా పీకేను కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్సల్టెంట్‌గా కాకుండా పార్టీలో చేరి నేతగా పని చేయాలని కోరగా పీకే సానుకూలంగా స్పందించారని నేతలంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై పీకే సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని వేణుగోపాల్ చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. అది వారంలో నివేదిక ఇస్తుంది’’ అని వివరించారు. పీకేను కాంగ్రెస్ చేరాల్సిందిగా కోరిన మాట నిజమేనా అని ప్రశ్నించగా వారంలో అన్నీ తెలుస్తాయని వేణుగోపాల్ బదులిచ్చారు. పీకే బ్లూప్రింట్‌పై రాజస్తాన్‌లో జరిగే కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లోనూ చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. 2020లో జేడీ (యూ)లో చేరిన పీకే, పౌరసత్వ (సవరణ) చట్టంపై పార్టీ వైఖరితో విభేదించి బహిష్కరణకు గురవడం తెలిసిందే. చదవండి: పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త.. -
బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దాం
న్యూఢిల్లీ: ఎన్నికలు తరచుగా జరుగుతూనే ఉంటా యని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒక ఏడాది కాలానికి బ్లూప్రింట్‌ను ఖరారు చేసే బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దామని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఓపెన్ మైండ్‌తో సభలో చర్చల్లో పాల్గొనాలని కోరారు. మోదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏదో ఒకచోట తరచుగా జరుగుతున్న ఎన్నికల కారణంగా పార్లమెంట్ భేటీలకు, చర్చలకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్లమెంట్లో స్వేచ్ఛాయుతంగా, సదుద్దేశంతో ఆలోచనాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. (చదవండి Budget 2022 Updates in Telugu) దేశ ఆర్థిక ప్రగతి, కోవిడ్–19 వ్యాక్సినేషన్, స్వదేశంలో కరోనా టీకాల ఉత్పత్తి వంటి వాటితో అంతర్జాతీయంగా భారత్ పట్ల విశ్వాసం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని ఎంపీలకు సూ చించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఎంపీలందరితోపాటు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఓపెన్ మైండ్‌తో జరిపే నాణ్య మైన చర్చలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. పూర్తి అంకితభావంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేస్తే రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకొనేం దుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రచ్చ తప్పదా? రైతుల సమస్యలు, దేశ సరిహద్దులో చైనా సైన్యం ఆగడాలు, పెగాసస్ స్పైవేర్ వంటి కీలక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ 2017లో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో బడ్జెట్ సమావేశాలు హోరెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో మోదీ -
బంగారం స్పాట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు బ్లూప్రింట్
ముంబై: దేశంలో బంగారం స్పాట్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉండడంతో ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ రూపొందించేందుకు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందులో పరిశ్రమకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు. ‘‘ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో బులియన్ ట్రేడర్లు, బ్యాంకర్లు, నియంత్రణ సంస్థలకు చెందిన వారికి చోటుంటుంది. కేంద్ర ప్రభుత్వం బంగారం స్పాట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సాయాన్ని ఈ కమిటీ అందిస్తుంది’’ అని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. ‘‘ఈ ఎజెండాను ఏ ఒక్క సంస్థో సొంతంగా నిర్వహించలేదు. సన్నిహిత సంప్రదింపులతోపాటు పరిశ్రమ వ్యాప్తంగా సహకారం, సమన్వయం అవసరం. అలాగే, మార్కెట్లో పాలుపంచుకునేవారు, నియంత్రణ సంస్థలను కూడా ఇందులో భాగం చేయాలి’’ అని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలియజేసింది. -
కొత్త శాసనసభ భవన నమూనా కోసం పర్యటన
అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణ నమూనా కోసం ప్రత్యేక బృందం ఈ నెల 27 నుంచి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని తన కార్యాలయంలో బుద్ధప్రసాద్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని, ఇందులో తనతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, బీజేపీ నుంచి విష్ణుకుమార్, వైఎస్సార్సీపీ నుంచి అమరనాథ్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారని చెప్పారు. ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పర్యటించి శాసనసభ మందిరాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు. అక్కడి స్పీకర్, శాసనమండలి అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు చెప్పారు. 28న వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం కేరళ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అసెంబ్లీ భవనాలను పరిశీలిస్తామన్నారు. వీటి నమూనాతో పాటు పలు సూచనలు, సలహాలతో స్పీకర్‌కి నివేదికను సమర్పిస్తామని చెప్పారు. -
ఐసీసీకి పోటీగా మరో వ్యవస్థ
బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది లలిత్ మోదీ ప్రకటన లండన్: ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. బీసీసీఐని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానడం లేదు. బోర్డుచేత జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న తను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయితే ఇందులో టెస్టులు, టి20 ఫార్మాట్ మాత్రమే ఉంటుందని.. వన్డే క్రికెట్‌ను తొలగిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త బాడీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా వ్యవహరిస్తుందని కూడా తెలిపారు. అయితే గతంలోనే ఐసీసీకి సమాంతరంగా మరో వ్యవస్థ రానుందని వార్తలు వచ్చినప్పుడు అందులో తన భాగస్వామ్యాన్ని మోదీ ఖండించారు. ‘నేనిప్పుడు మరో క్రికెట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. బ్లూ ప్రింట్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే నా ఆమోద ముద్ర కూడా పడిపోయింది. నేనిందులో పూర్తిగా భాగస్వామ్యమయ్యానని తొలిసారిగా చెబుతున్నాను. త్వరలోనే ఆమల్లోకి తెస్తాం. అయితే ఇందుకోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయి. కానీ ఇది పెద్ద సమస్య కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడున్న ఐసీసీలో సంస్కరణలు ప్రారంభమైతేనే నా పథకం విఫలమవుతుంది. ఈ బ్లూ ప్రింట్ అమల్లోకి రావద్దనే ఆశిస్తున్నాను. అయితే ఐసీసీ మారకపోతే మాత్రం మేమనుకున్న కొత్త వ్యవస్థ సంచలనం సృష్టించడం ఖాయం’ అని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఐసీసీ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. తానెప్పటి నుంచో ఈ మాట చెబుతున్నా వారు వినడం లేదని, ఐపీఎల్ కూడా తన మార్కెటింగ్ చాతుర్యంతోనే విజయవంతమయిందని మోదీ గుర్తుచేశారు. -
'విజయవాడ అభివృద్ధికి బ్లూ ప్రింట్ '
విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్ స్థానానికి తీసుకు వస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం కోనేరు ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ నగరాభివృద్ధి కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు చెప్పారు. విజయవాడ నగరాన్ని రాజకీయ నాయకులు ఇప్పటి వరకు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. నగరాభివృద్ధికి గతంలో నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. విజయవాడ నగరం వల్ల నాయకులు అభివృద్ధి చెందారు. కానీ విజయవాడ అభివృద్ధి చెందలేదని కోనేరు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
నో.. ఎమ్మార్పీ
సాక్షి, గుంటూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎక్సైజ్ శాఖలో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే, వాటిని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. వ్యాపారులు సిండి కేట్‌గా మారి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోపాటు సిండికేట్లను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల జిల్లాలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నల్లగొండ, విజయవాడ నుంచి అధికారులను పంపి కేసులు నమోదు చేయించారంటే ఇక్కడి అధికారులపై ఉన్నతాధికారులకు ఎంత నమ్మకం వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అన్ని రకాల మద్యం బాటిళ్లపై ప్రాంతాలను బట్టి రూ.20 నుంచి రూ. 50 వరకు ధర పెంచి విక్రయిస్తున్నారు. బీరు బా టిల్ పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. ఇక, బార్ అండ్ రెస్టారెంట్లలో ధరలు నోరు పట్టనంతగా అమలవుతున్నాయి. పల్నాడులోని వ్యాపారులు అధిక లాభాల కోసం కొత్త టెక్నిక్ ప్రయోగిస్తున్నారు. వైన్‌లో ఒకట్రెండు బ్రాండ్లను మాత్రమే అమ్ముతూ వినియోగదారులు ఎక్కువగా అడిగే బ్రాండ్లను సమీప బెల్ట్‌దుకాణాల్లో ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో వైన్ లెసైన్స్ వ్యాపారి ఆరుకు మించి బెల్ట్ దుకాణాలు నడిపిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక్కో వైన్ దుకాణం లెసైన్స్ ఫీజు కంటే ఆరురెట్లు అధిక అమ్మకాలు చేయాలి. అంతకంటే ఎక్కువ అమ్మకం జరిపిన స్టాక్‌పై 8.5 శాతం అదనపు సుంకం చెల్లించాలి. దీంతో వ్యాపారులు ప్రభుత్వ డిపోల వద్దకెళ్లకుండా పక్క దుకాణాల నుంచి స్టాక్ తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. బార్లు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, సింగిల్ కౌంటర్, లూజు విక్రయాల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతుంది. నెలవారీ మామూళ్ల ‘మత్తు’.. జిల్లాలో మద్యం వ్యాపారుల అక్రమాలను పట్టించుకోకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీ అందుతున్న మామూళ్లు రూ.లక్షల్లో ఉంటాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఏసీబీ దాడులు, కేసులు నమోదును ‘బూచి’గా చూపి అధికారులు అందినంత పిండుకుంటున్నారని అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. జిల్లాలో వేలం జరగని ప్రాంతాలు 18 ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రభుత్వమే విక్రయాలు చేపట్టాల్సి వుండగా, సరిపడ సిబ్బంది, మౌలిక వనరులు లేకపోవడమనేది కొందరు జిల్లా అధికారుల పాలిట వరంగా మారింది. ఆ ప్రాంతాల్లో అనధికార అమ్మకాలు జరిపే దుకాణదారుల నుంచి నెలకు రూ.2లక్షలకు పైగానే మామూళ్లు తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. డీసీ కుల్లాయప్ప వివరణ.. ఈ వ్యవహారాలపై జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్లాయప్పను ‘సాక్షి’ వివరణ కోరగా, ఎమ్మార్పీ ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టితో దాడులు చేయిస్తున్నట్లు చెప్పారు. కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు రూ.50లక్షలపైగా కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశామన్నారు. తమ శాఖ అధికారుల అవినీతిపై ఇంతవరకు ఫిర్యాదులు రాలేదని ఎవరైనా నేరుగా ఫిర్యాదిస్తే చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.