ఐసీసీకి పోటీగా మరో వ్యవస్థ
బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది లలిత్ మోదీ ప్రకటన
లండన్: ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. బీసీసీఐని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానడం లేదు. బోర్డుచేత జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న తను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయితే ఇందులో టెస్టులు, టి20 ఫార్మాట్ మాత్రమే ఉంటుందని.. వన్డే క్రికెట్‌ను తొలగిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త బాడీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా వ్యవహరిస్తుందని కూడా తెలిపారు. అయితే గతంలోనే ఐసీసీకి సమాంతరంగా మరో వ్యవస్థ రానుందని వార్తలు వచ్చినప్పుడు అందులో తన భాగస్వామ్యాన్ని మోదీ ఖండించారు. ‘నేనిప్పుడు మరో క్రికెట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. బ్లూ ప్రింట్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే నా ఆమోద ముద్ర కూడా పడిపోయింది.
నేనిందులో పూర్తిగా భాగస్వామ్యమయ్యానని తొలిసారిగా చెబుతున్నాను. త్వరలోనే ఆమల్లోకి తెస్తాం. అయితే ఇందుకోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయి. కానీ ఇది పెద్ద సమస్య కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడున్న ఐసీసీలో సంస్కరణలు ప్రారంభమైతేనే నా పథకం విఫలమవుతుంది. ఈ బ్లూ ప్రింట్ అమల్లోకి రావద్దనే ఆశిస్తున్నాను. అయితే ఐసీసీ మారకపోతే మాత్రం మేమనుకున్న కొత్త వ్యవస్థ సంచలనం సృష్టించడం ఖాయం’ అని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఐసీసీ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. తానెప్పటి నుంచో ఈ మాట చెబుతున్నా వారు వినడం లేదని, ఐపీఎల్ కూడా తన మార్కెటింగ్ చాతుర్యంతోనే విజయవంతమయిందని మోదీ గుర్తుచేశారు.