ధోనీ జాబ్ వెనక వందల కోట్ల స్కామ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ ఓనర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ లీక్ చేశారు. ధోనీ, శ్రీనీకి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని అభిప్రాయపడ్డారు. ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు.
2012 జూన్‌లో ధోనీని ఇండియా సిమెంట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్‌ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్‌లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు.
రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్‌పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్‌కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు. మరోవైపు రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్ 11లో సందడి చేయనున్నాయి.