సాక్షి, గుంటూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎక్సైజ్ శాఖలో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే, వాటిని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. వ్యాపారులు సిండి కేట్‌గా మారి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోపాటు సిండికేట్‌లను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇటీవల జిల్లాలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నల్లగొండ, విజయవాడ నుంచి అధికారులను పంపి కేసులు నమోదు చేయించారంటే ఇక్కడి అధికారులపై ఉన్నతాధికారులకు ఎంత నమ్మకం వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో అన్ని రకాల మద్యం బాటిళ్లపై ప్రాంతాలను బట్టి రూ.20 నుంచి రూ. 50 వరకు ధర పెంచి విక్రయిస్తున్నారు. బీరు బా టిల్ పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. ఇక, బార్ అండ్ రెస్టారెంట్‌లలో ధరలు నోరు పట్టనంతగా అమలవుతున్నాయి. పల్నాడులోని వ్యాపారులు అధిక లాభాల కోసం కొత్త టెక్నిక్ ప్రయోగిస్తున్నారు. వైన్‌లో ఒకట్రెండు బ్రాండ్‌లను మాత్రమే అమ్ముతూ వినియోగదారులు ఎక్కువగా అడిగే బ్రాండ్‌లను సమీప బెల్ట్‌దుకాణాల్లో ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో వైన్ లెసైన్స్ వ్యాపారి ఆరుకు మించి బెల్ట్ దుకాణాలు నడిపిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక్కో వైన్ దుకాణం లెసైన్స్ ఫీజు కంటే ఆరురెట్లు అధిక అమ్మకాలు చేయాలి. అంతకంటే ఎక్కువ అమ్మకం జరిపిన స్టాక్‌పై 8.5 శాతం అదనపు సుంకం చెల్లించాలి. దీంతో వ్యాపారులు ప్రభుత్వ డిపోల వద్దకెళ్లకుండా పక్క దుకాణాల నుంచి స్టాక్ తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. బార్‌లు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, సింగిల్ కౌంటర్, లూజు విక్రయాల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతుంది.
నెలవారీ మామూళ్ల ‘మత్తు’.. జిల్లాలో మద్యం వ్యాపారుల అక్రమాలను పట్టించుకోకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీ అందుతున్న మామూళ్లు రూ.లక్షల్లో ఉంటాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఏసీబీ దాడులు, కేసులు నమోదును ‘బూచి’గా చూపి అధికారులు అందినంత పిండుకుంటున్నారని అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. జిల్లాలో వేలం జరగని ప్రాంతాలు 18 ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రభుత్వమే విక్రయాలు చేపట్టాల్సి వుండగా, సరిపడ సిబ్బంది, మౌలిక వనరులు లేకపోవడమనేది కొందరు జిల్లా అధికారుల పాలిట వరంగా మారింది. ఆ ప్రాంతాల్లో అనధికార అమ్మకాలు జరిపే దుకాణదారుల నుంచి నెలకు రూ.2లక్షలకు పైగానే మామూళ్లు తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
డీసీ కుల్లాయప్ప వివరణ..
ఈ వ్యవహారాలపై జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్లాయప్పను ‘సాక్షి’ వివరణ కోరగా, ఎమ్మార్పీ ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టితో దాడులు చేయిస్తున్నట్లు చెప్పారు. కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు రూ.50లక్షలపైగా కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశామన్నారు. తమ శాఖ అధికారుల అవినీతిపై ఇంతవరకు ఫిర్యాదులు రాలేదని ఎవరైనా నేరుగా ఫిర్యాదిస్తే చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.