యాంబీ వ్యాలీ వేలం నేడే
ముంబై: సహారా గ్రూపునకు చెందిన విలువైన యాంబీ వ్యాలీ వేలానికి ముహూర్తం ఖరారైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల తరువాత ఈ ప్రిస్టీజియస్ భవనాన్ని బాంబై హైకోర్టు సోమవారం వేలం వేయనుంది. వేలం నిలిపివేతకు సహారా గ్రూపు అభ్యర్థనను సుప్రీం తిరస్కరించిన నేపథ్యంలో సహారా గ్రూపునకు అతి కీలకంగా భావించే మహారాష్ట్ర , పుణే లోనావాలాలోని వ్యాలీని నేడు బహిరంగ వేలంవేయనుంది. అధికారిక లిక్విడేటర్ రూ.37,392 కోట్ల రిజర్వ్ ధరగా నిర్ణయించింది.
కాగా వేలం ప్రక్రియను నిలిపివేస్తే, రూ.1,500 కోట్లు తక్షణం చెల్లిస్తామని సహారా చీఫ్ సుబ్రతో రాయ్ చేసిన ప్రతిపాదనను తీరస్కరించిన సుప్రీం రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకారం సహారా వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.