
ఐపీఓ మార్కెట్ జోరు..
♦ సెబీ సంస్కరణలతో జోష్
♦ ఐపీఓకు రానున్న 30కి పైగా కంపెనీలు
♦ రూ.20,000 కోట్ల సమీకరణ అంచనా
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు జోరుగా ఉన్నాయి. ఒడిదుడుకులున్నా స్టాక్ మార్కెట్ పుంజుకుంటుండటం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, ఐపీఓకు సంబంధించి పలు సంస్కరణలను తీసుకురావడం ఐపీఓ మార్కెట్‌కు మరింత జోష్‌నిస్తోంది. దాదాపు 30కు పైగా కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.20,000 కోట్లకు పైగా నిధులు సమీకరణకు క్యూలో ఉన్నాయి.
వరుసలో దిగ్గజ సంస్థలు...
జీవీకే గ్రూప్‌కు చెందిన విమానాశ్రయాల వ్యాపార విభాగం, జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల నిధులు సమీకరించాలని ఈ గ్రూప్ యోచిస్తోంది. బయోకాన్‌కు చెందిన సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించడానికి సెబీ ఆమోదం పొందింది. రూ.2,500 కోట్లు సమీకరించాలని భావిస్తున్న విమానయాన సంస్థ ఇండిగో ఈ వారంలోనే ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను సెబీకి దాఖలు చేయనున్నది. కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ సెల్యులర్ ఇప్పటికే ఈ పత్రాలను దాఖలు చేశాయి.
20 ఐపీఓలకు సెబీ ఆమోదం
ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 19 కంపెనీలు ఐపీఓల కోసం సెబీకి సంబంధిత ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి. గత ఏడాదిలో పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని సెబీ ఇప్పటివరకూ 20 కంపెనీల ఐపీఓలకు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం సెబీ వద్ద ఐదు కంపెనీల ఐపీఓల ప్రతిపాదనలే పెండింగ్‌లో ఉన్నాయని సమా చారం. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎనిమిది కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీలు రూ.4,000 కోట్ల వరకూ నిధులు సమీకరించాయి. గత ఏడాదిలో ఆరు కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. రూ.1,528 కోట్ల నిధులు సమీకరించాయి. ఐపీఓల కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్న వాటిల్లో ఎక్కువ భాగం మధ్య సైజు కంపెనీలే. ఐపీఓల ద్వారా ఇవి రూ.200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు సమీకరించనున్నాయి.
సెబీ తాజా సంస్కరణలు...
ఇటీవలనే సెబీ ఐపీఓలకు సంబంధించి పలు సంస్కరణలను తెస్తోంది. గతంలో 12 రోజులుగా ఉన్న లిస్టింగ్ కాలాన్ని సగానికి... ఆరు రోజులకు తగ్గించింది. ఇన్వెస్టర్లు ఐపీఓ చెల్లింపులకు ఎలాంటి చెక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్బా(అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్) అన్ని రకాల ఇన్వెస్టర్లకు తప్పనిసరి చేసింది. త్వరలో ఇ (ఎలక్ట్రాన్) ఐపీఓలకు సంబంధించిన సంస్కరణలు తేనున్నది. తాజా సంస్కరణల వల్ల ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు వ్యయప్రయాసలు బాగా తగ్గుతాయి.
ఐపీఓ ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని బీఎస్‌ఈ పేర్కొంది. ఈ తాజా సంస్కరణల నుంచి ప్రయోజనం పొందడానికి పలు కంపెనీలు ఐపీఓ బాట పడుతున్నాయి. కాగా, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరిపే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని, ఏడాది కాలం నుంచి స్టాక్ మార్కెట్లో బుల్ రన్ జరుగుతున్నా, ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని నిపుణులంటున్నారు. సెబీ సం స్కరణల ప్రభావంతో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 25% పెరుగుతుందని అంచనా.
ఫండమెంటల్స్ బాగా ఉంటేనే...
భారత ప్రైమరీ మార్కెట్‌పై కంపెనీలు, ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఈక్విటీల జారీకి ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్ సరాఫ్ చెప్పారు. అయితే పటిష్టమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు, సరైన ధర ఉన్న ఐపీఓలకు మంచి ఆదరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.