
బ్రిటిష్ ఎయిర్‌వేస్ వినూత్న ఆఫర్
ప్రయాణ చార్జీలపై రూ.8,400 వరకు తగ్గింపు
ముంబై: ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు భారతీయ విమాన కంపెనీలు చార్జీలపై భారీ డిస్కౌంట్లు ఇవ్వడాన్ని ఇప్పటివరకు చూశాం. ఇప్పుడిక బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంతొచ్చింది. ఆరునెలల యూకే వీసా ఖర్చుకు సమానమైన మొత్తాన్ని చార్జీలో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియా నుంచి యూకే వెళ్లడానికి జూన్ 30వ తేదీలోగా బుక్ చేసుకునే టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రయాణించాల్సి ఉంటుంది. గత నెల 8వ తేదీ తర్వాత జారీ అయిన వీసాలకే ఆఫర్ వర్తిస్తుందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ మంగళవారం తెలిపింది. ప్రయాణికులకు దీర్ఘకాలిక వీసాలున్నా పర్వాలేదు. కానీ, చార్జీలో గరిష్టంగా రూ.8,400 మాత్రమే తగ్గిస్తారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ లండన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులకు వారానికి 48 విమానాలు నడుపుతోంది.