బీఎస్‌ఎన్‌ఎల్‌కు భూమే బంగారం
♦ ఖరీదైన భూములు
♦ ఒక వంతుభూమి విలువే రూ.65,000 కోట్లు
♦ పుస్తక విలువ కంటే ఎన్నో రెట్లు అధికం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, భవనాలు ఆ సంస్థకు వరం కానున్నాయి. సంస్థ ఆధ్వర్యంలోని భూముల్లో మూడింట ఒక వంతు తేలిగ్గా రూ. 65,000 కోట్ల విలువ చేస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. కానీ, 15,000 చోట్ల భూములు, భవనాలకు సంబంధించి పుస్తక విలువ ఎన్నో దశాబ్దాల క్రితం మదింపు వేసిన రూ.975 కోట్లుగానే ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వీటి వాస్తవ విలువ తెలిసేందుకు వీలుగా తిరిగి నిపుణులతో మదింపు వేయిస్తున్నట్టు చెప్పారు. 2015–16లో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.3,880 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్టు అంచనా. దీంతో సంస్థ ఆస్తుల విలువను లెక్కించే వసుంధర ప్రాజెక్టును ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు.
దీన్ని కేపీఎంజీ సంస్థ చూస్తోంది. ముఖ్యంగా సంస్థ నిర్వహణలోని భూములు, భవనాల్లో మూడింట ఒక వంతు అందులోనూ ప్రముఖ పట్టణాల్లో ఉన్న వాటి విలువను తేల్చే పనిలో ఉన్నారు. అది ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ పని 98% వరకు పూర్తయిందని, ఒక వంతు ఆస్తుల అసలు విలువ రూ.65,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. ఇలా లెక్కిస్తున్న వాటిలో ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లోని ఆస్తులు కూడా ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఒక్కదాని విలువే రూ. 2,500 కోట్లు చేస్తుందని శ్రీవాస్తవ వెల్లడించారు. వ్యాపార పునరుద్ధరణ ప్రణాళికలపైనా బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి సారించడం గమనార్హం.
లాభదాయకమైనవి: బీఎస్‌ఎన్‌ఎల్ మొత్తం ఆస్తుల్లో కేవలం ఒక వంతు వాటి విలువనే ఎందుకు లెక్కిస్తున్నారన్న ప్రశ్నకు, అవి అత్యంత లాభదాయకమైనవిగా శ్రీవాస్తవ పేర్కొన్నారు. మిగిలిన వాటి విలువ మరీ అంత ఎక్కువేమీ ఉండదన్నారు. వీటిని విక్రయించి నిధులు సమీకరించాలనుకుంటే, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాలన్నా తాజా మదింపు ఉపయోగపడుతుందన్నారు. భూముల అసలు విలువ బీఎస్‌ఎన్‌ఎల్ ఖాతా పుస్తకాల్లో ప్రతిఫలిస్తుంద చెప్పారు.