బ్రాడ్‌బాండ్‌లో బంఫర్ ఆఫర్
ముంబై: రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది. కొత్త కస్టమర్ల కోసం రూ.249కే బ్రాడ్‌బాండ్‌లో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. నెలకు కేవలం రూ.249 చెల్లిస్తే 300 జీబీ వరకు ఉచితంగా డేటా అందిస్తున్నట్టు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఆఫర్ వచ్చే ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత 499 ప్లాన్‌కు మారుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.
ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ప్రతి రోజు 10జీబీ డేటా వరకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని 2ఎంబీపీఎస్ వేగంతో అందిస్తుంది.10జీబీ తర్వాత ఈ వేగం 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ కొత్త ఆఫర్ జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబర్ ప్రాంతాల్లో మినహా దేశంలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది.
ఇదే ప్లాన్‌లోనే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం అన్ని సమయాల్లోనూ ఉచిత కాల్స్ చేసుకునే మరో సదుపాయం కల్పించింది. ఈ పథకంలో అదనంగా ఇతర ఏ చార్జీలు వసూలు చేయబోమని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క నెల అడ్వాన్స్‌గా రూ.249 చెల్లించి కనెక్షన్ పొందవచ్చని తెలిపింది.