బీఎస్‌ఎన్‌ఎల్ ప్రగతిపథంలో పయనిస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ అన్నారు. 19శాతం అదనపు ఆదాయం సాధించడం ద్వారా అనంతపురం జిల్లాను తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలుపగలిగామన్నారు.
అనంతపురం రూరల్ : బీఎస్‌ఎన్‌ఎల్ ప్రగతిపథంలో పయనిస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ అన్నారు. 19శాతం అదనపు ఆదాయం సాధించడం ద్వారా అనంతపురం జిల్లాను తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలుపగలిగామన్నారు. ఆ దిశగా కృషి చేసిన ఉద్యోగులను అభినందించారు. శనివారం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో రూ.79 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.94కోట్లు వచ్చిందన్నారు. 2016 - 17లో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను, పోటీని ధీటుగా ఎదుర్కొని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించామన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారలు ఇతర నెట్‌వర్కుల్లోకి మారకుండా మంచి ఆఫర్లను ప్రవేశపెట్టి ఇతర నెట్‌వర్క్‌ల కస్టమర్లను సైతం ఆకట్టుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7లక్షలకు పైగా ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీఎస్‌ఎమ్ వినియోగదారులను కలిగి జిల్లాలో ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ 3జీ సేవలు అందిస్తున్నామన్నారు. వేగంతో కూడిన సేవలను అందించడం కోసం ఈ ఏడాది అదనంగా 169 3జీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నామని, వచ్చే ఆగస్టులోపు జిల్లా వ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఇన్‌స్టలేషన్ చార్జీలు మినహాయింపు
బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక‌్షన్లు తీసుకునే వినియోగదారులకు, పాత కనెక్షన్లను పునరుద్ధరించుకునే వినియోగదారులకు రూ.800 ఇన్‌స్టలేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ జూన్ 30వరకు ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.