heavy sales
-
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
రాయదుర్గం: వినాయక నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని 9 మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి సీజ్ చేశారు. అయితే అవేమీ పట్టనట్లు కొంతమంది లైసెన్స్‌దారులు తమ వ్యక్తులతో పాత బస్డాండు, కేబీ ప్యాలేస్ రోడ్డు, బళ్లారి రోడ్డులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపట్టారు. అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారని ప్రజలే ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోగా అమ్మే వ్యక్తులు బాటిళ్లు వదిలి పరారయ్యారు. ఎక్సైజ్ సీఐ సోమశేఖర్‌ను వివరణ కోరగా పాతబస్టాండు వద్ద 20 హెచ్డీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాటిళ్లపై ఉన్న బ్యాచ్ నంబర్ 205 ఎల్8, 14.08.2017 ఆధారంగా ఏ షాపు వారిదో గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రగతి పథంలో బీఎస్ఎన్ఎల్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ ప్రగతిపథంలో పయనిస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ అన్నారు. 19శాతం అదనపు ఆదాయం సాధించడం ద్వారా అనంతపురం జిల్లాను తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలుపగలిగామన్నారు. ఆ దిశగా కృషి చేసిన ఉద్యోగులను అభినందించారు. శనివారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో రూ.79 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.94కోట్లు వచ్చిందన్నారు. 2016 - 17లో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను, పోటీని ధీటుగా ఎదుర్కొని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించామన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారలు ఇతర నెట్వర్కుల్లోకి మారకుండా మంచి ఆఫర్లను ప్రవేశపెట్టి ఇతర నెట్‌వర్క్‌ల కస్టమర్లను సైతం ఆకట్టుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7లక్షలకు పైగా ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీఎస్ఎమ్ వినియోగదారులను కలిగి జిల్లాలో ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ 3జీ సేవలు అందిస్తున్నామన్నారు. వేగంతో కూడిన సేవలను అందించడం కోసం ఈ ఏడాది అదనంగా 169 3జీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నామని, వచ్చే ఆగస్టులోపు జిల్లా వ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇన్స్టలేషన్ చార్జీలు మినహాయింపు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు, పాత కనెక్షన్లను పునరుద్ధరించుకునే వినియోగదారులకు రూ.800 ఇన్స్టలేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ జూన్ 30వరకు ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
హీరో, హోండా.. రికార్డు విక్రయాలు
* ధన్‌తేరాస్ రోజున టూవీలర్ అమ్మకాల జోరు... 2 లక్షలు విక్రయించిన హీరో * హోండా అమ్మకాలు 1.65 లక్షలు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ధన్‌తేరాస్ రోజున భారీ అమ్మకాలు నమోదు చేశాయి. హీరో ఏకంగా రెండు లక్షల వాహనాల అమ్మకాల మార్కును అధిగమించింది. ఇలా ఒక్క రోజులో ఇన్ని అమ్మకాలు సాధించ డం తమకు ఇదే తొలిసారని, గతేడాది ఇదే రోజుతో పోలిస్తే 80% పైగా వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ నేషనల్ సేల్స్ హెడ్ ఎ.శ్రీనివాసు తెలిపారు. డిమాండ్ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి అందుకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు హోండా 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. గతేడాది ధన్‌తేరాస్ రోజున 78,500 వాహనాలు విక్రయించగా.. ఈసారి అమ్మకాలు ఏకంగా 110% వృద్ధి చెందినట్లు తెలిపింది. హీరో నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత ఇదే తమకు తొలి పండుగ సీజన్ అని, భారీ విక్రయాలు కస్టమర్లకు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియజే స్తోందని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ యాదవీందర్ గులేరియా చెప్పారు. ఈ పండుగ సీజన్‌ను రికార్డు అమ్మకాలతో ముగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నూరు చేపలకు భలే గిరాకీ
చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు కేంద్రంగా చేపల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ నాణ్యమైన చేపలను ఇక్కడి నుంచే జిల్లా నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఆదివారానికి ముందురోజు (శనివారం) భారీగా విక్రయాలు జరుగుతాయి. ఈ ఒక్క రోజులోనే 7 నుంచి 10 టన్నుల చేపలను హోల్‌సేల్ ధరలకు విక్రయిస్తారు. అన్ని రకాల చేపలు ఇక్కడ లభిస్తుండటంతో పాటు నాణ్యతగా ఉండటంతో ఆరేళ్లుగా అమ్మకాలు విస్తరిస్తున్నాయి. వారానికి 10 నుంచి 15 లక్షల చేపల వ్యాపారం ఇక్కడ జరుగుతోంది. ఇదిలా ఉండగా నెల రోజులుగా చేపల ధరలు భారీగా పెరిగాయి. కిలో చేప రూ. 50 నుంచి 90 లోపు ఉండగా ప్రస్తుతం 80 నుంచి 130కి పెరిగింది. చెన్నూరు వద్ద బొచ్చ, రోకు, గడ్డిమోసు, కాకిగండె, కొరమీను రకం చేపలు లభిస్తాయి. ఇటీవల స్థానిక పెన్నానదిలో చేపలు తక్కువగా పడుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్‌లో ప్రతి రోజు అక్రమ చేపల వేట సాగుతోందని, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోక పోవడంతో తమకు చేపలు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరులో చేపలు పట్టి అమ్మకాలు చేసే కుటుంబాలు 150 వరకు ఉన్నాయి. వీరందరూ చేపల అమ్మకం ద్వారానే దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో నెల్లూరు జిల్లా సంఘం, బుచ్చి వంటి చోట్ల చేపలు తెప్పించేవారు. అలాగే స్థానిక పెన్నానదిలో చేపలు పట్టి తక్కువ ధరలతో విక్రయించేవారు. ప్రస్తుతం 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడ, కైకలూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో రవాణాతో పాటు ఖర్చు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కిలో చేపలు 150 నుంచి 180 వరకు అమ్మాల్సి వస్తున్నదని, వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు అక్రమ చేపల వేటను నిరోధిస్తే ప్రయోజనం ఉంటుందని, ధరలు తగ్గించవచ్చని స్థానిక మత్య్సకారులు చెబుతున్నారు. చేపల వేటను నిరోధించాలి సోమశిల డ్యాం నుంచి పెన్నానదిలోకి చేపలు వస్తాయి. అక్రమంగా చేపలు పడుతుండటంతో చాలా తక్కువగా వస్తున్నాయి. విజయవాడ, కైకలూరు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలిస్తున్నాం. అధికారులు అక్రమ వేటను నిరోధించాలి - పీసు సుబ్బరాయుడు మత్య్సకారుడు, చెన్నూరు చాలా ఇబ్బంది పడుతున్నాం ధరలు భారీగా పెరగడంతో చేపలు కొని అమ్మకాలు చేయలేకున్నాం. పెన్నానదిలో చేపలు చాలా తక్కువ పడుతుండటంతో కొనుగోలు చేసే అమ్మాలి. చుట్టూ ఉన్న జిల్లాల్లో లభించక పోవడంతో 600 కిలోమీటర్ల నుంచి తెప్పిస్తున్నాం. వారు కిలో రూ. 100కు పైగానే అమ్ముతున్నారు. - సి.శంకర్ మత్య్సకారుడు చెన్నూరు