ఫేస్‌బుక్, మొబిక్విక్‌లతో బీఎస్‌ఎన్‌ఎల్ జట్టు
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా ఫేస్‌బుక్, మొబిక్విక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్.. ఇంటర్నెట్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని, తన వాల్యు యాడెడ్ సర్వీసులకు మరింత ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భాగస్వామ్యాలు కుదరడం గమనార్హం. ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్.. ఫేస్‌బుక్ ఎక్స్‌ప్రెస్ వై–ఫై ప్రోగ్రామ్‌కు కనెక్టివిటీ సాయం అందించనుంది.
కాగా ఫేస్‌బుక్ తన ఎక్స్‌ప్రెస్ వై–ఫై ప్రోగ్రామ్ కింద టెలికం ఆపరేటర్ల సాయంతో పబ్లిక్ హాట్‌స్పాట్స్ ద్వారా గ్రామీణ ప్రాంత యూజర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనుంది. మరొక ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్.. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వాలెట్ ఏర్పాటుకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ సంస్థ మొబిక్విక్‌తో కలిసి పనిచేయనుంది. ఇది కేవలం భారత్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మొబిక్విక్ అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులను తన యాప్, వెబ్‌సైట్స్ ద్వారా విక్రయించనుంది.