వచ్చేది సంస్కరణల బడ్జెట్..! | Budget 2015: FM Arun Jaitley hints at reform-packed Budget | Sakshi
Sakshi News home page

వచ్చేది సంస్కరణల బడ్జెట్..!

Published Sat, Feb 7 2015 1:35 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

వచ్చేది సంస్కరణల బడ్జెట్..! - Sakshi

వచ్చేది సంస్కరణల బడ్జెట్..!

ఆర్థిక మంత్రి  జైట్లీ సంకేతాలు..
* ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం...
* గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలవల్లే ఆర్థిక వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్య

ముంబై: పార్లమెంటులో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే తమ బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేయనుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం సూచించారు. ఎటువంటి లొసుగులూ లేకుండా- ప్రభుత్వ వ్యయాల వ్యవస్థ హేతుబద్ధీకరణ, ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సంస్కరణల ప్రతిపాదనలను బడ్జెట్‌లో చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

నిరంతరం రుణ నిధులపై ఆధారపడడంలో ప్రభుత్వానికి విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మార్కెట్ రుణ ప్రణాళిక అంచనా (రూ.5.97 లక్షల కోట్లు) మొత్తంలో నవంబర్ నాటికే (ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలలు ఉండగానే) 99 శాతానికి చేరిన నేపథ్యంలో జైట్లీ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారీగా మార్కెట్ రుణ ప్రణాళికలమీద ఆధారపడటం, రానున్న తరంపై రుణ భారం వేయడమేనన్నారు. ‘ముంబై నెక్స్ట్-అంతర్జాతీయ ఫైనాన్షియల్ కేంద్రంగా ఆవిర్భావం’ అనే పేరుతో జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైట్లీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులను ఉద్దేశించి జైట్లీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..
* బడ్జెట్‌లో స్థిరమైన పన్నుల వ్యవస్థను ఆవిష్కరిస్తాం.   మన పన్నుల విధానం ఇన్వెస్టర్లకు పూర్తి సానుకూలంగా లేదు. ఆయా అంశాలను సరిచేసే విషయంలో కేంద్రం గత కొద్ది నెలలుగా తగిన చర్యలు తీసుకుంటోంది.
* విద్యుత్, ఇంధనం, రైల్వేలు, పోర్టుల విభాగాల్లో భారీ సంస్కరణలపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు మరింత పెంచుతాం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రణాళికా వ్యయం కొంత తగ్గించుకోవడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతానికి కట్టుబడి ఉన్నాం.
* గడచిన పదేళ్లూ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. అప్పటి ప్రభుత్వం పలు అంశాల్లో తగిన విధానాలు అవలంబించలేదు. పైగా తీసుకున్న పలు తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.
 
ఇన్‌ఫ్రాకు నిధులపై ముకేశ్ ప్రశ్న!
ముంబైలో మౌలిక ప్రాజెక్టులకు ఫైనాన్స్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ... ఇది ఒక్క మహారాష్ట్రకు సంబంధించిన అంశమే కాదని, దేశం మొత్తానికి ఉద్దేశించిందన్నారు. ఫైనాన్సింగ్ వ్యవస్థను మొదట తగిన బాటలో పెడితే, తరువాత ఇన్‌ఫ్రాకు నిధుల ఏర్పాటు సమస్య చాలా వరకూ తీరిపోతుందని సూచించారు. మౌలిక రంగం అభివృద్ధిలో రాష్ట్రాలకు పూర్తిగా సహకారం లభిస్తుందన్నారు.

పొదుపులను ఈ విభాగంలోకి మళ్లించడంపైనా దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ రంగంలో పెట్టుబడులకు ఏ నమూనాలను పాటిస్తున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయా నమూనాలను దేశంలో అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను శోధిస్తున్నామన్నారు. ‘ఇందుకు సంబంధించి త్వరలో మరింత సమాచారం మీకు అందుతుంది’ అని జైట్లీ అన్నారు.


నిర్ణయాల్లో జాప్యమే వ్యాపారాలకు అడ్డంకి...
 
- సీబీఐ, కాగ్ వెంటాడుతుతాయనేది అధికారుల భయం
- అందుకే చేతులు కట్టేసుకుంటున్నారు...  
- అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ వ్యాఖ్యలు

ముంబై: ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాల్లో వేగం లోపించడమే దేశంలో వ్యాపార రంగానికి అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆరోపించారు. సీబీఐ, సీవీసీ, కాగ్ వంటి దర్యాప్తు, ఆడిటింగ్ ఏజెన్సీలకు భయపడకుండా ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు. టెలికం రంగంలో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నప్పటికీ తాము గత కొన్నేళ్లుగా నిర్ణయాల్లో జాప్యానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ముంబై నెక్స్ట్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో... పారదర్శకత కూడా అంతే ముఖ్యమని అనిల్ అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వాధికారులను కలిసినప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమయ్యేదో ఆయన వివరించారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటే దర్యాప్తు సంస్థలు ఎక్కడ తమపై కన్నేస్తాయోనన్న భయాలు వారిలో ఉన్నాయన్నారు.

అందుకే అసలు నిర్ణయాలు తీసుకోకపోవడమే అన్నింటికంటే ఉత్తమం అన్న ధోరణికి వారు అలవాటుపడిపోయారని వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల  బొగ్గు గనుల వేలం కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చర్యలకూ తావులేకుండా రక్షణ కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement