Budget reforms
-
సంస్కరణల ఆశలతో లాభాలు
నాలుగో రోజూ పైపైకే.. ముడి చమురు ధరలు రికవరీ కావడం, బడ్జెట్లో సంస్కరణలు ఉంటాయనే ఆశలతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం కూడా కలసివచ్చింది. కమోడిటీ ధరలు పెరగడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆయిల్, గ్యాస్ షేర్ల నేతృత్వంలో స్టాక్ మార్కెట్ లాభాల బాట నడిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 23,789 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 7,235పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాల్లోనే ముగిసింది. ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 597 పాయింట్లు ఎగసింది. ఆయిల్, గ్యాస్, ఫార్మా, లోహ, కొన్ని బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ♦ ఎల్ఐసీ కొనుగోళ్ల జోరు...: ఎల్ఐసీ ఈ క్యూ3లో సెన్సెక్స్ కంపెనీ షేర్లను జోరుగా కొనుగోలు చేసింది. ఈ కాలంలో రూ.10,400 కోట్ల విలువైన 18 సెన్సెక్స్ కంపెనీల షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. ♦ ‘ఏక వ్యక్తి సంస్థ’కు బీఎస్ఈ స్టాక్ బ్రోకింగ్ అనుమతులు కనీసం ఇద్దరు డెరైక్టర్లు కలిగిఉన్న ‘ఏక వ్యక్తి సంస్థ’ (ఓపీసీ) కూడా స్టాక్ బ్రోకర్‌గా వ్యవహరించవచ్చని బాంబే స్టాక్ ఎక్స్చేంజీ పేర్కొంది. అయితే, ప్రొప్రైటరీ అకౌంటు ద్వారా ట్రేడింగ్ నిర్వహించడానికి సదరు బ్రోకరుకు అనుమతులు ఉండవని ఈ సందర్భంగా వివరించింది. కొత్తగా ఐదు నిఫ్టీ స్టాక్ సూచీలు! ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా కొత్తగా ఐదు స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ సంస్థ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ తెలిపింది. వివిధ స్టాక్ సూచీల్లో షేర్ల ఎంపిక విధానాల్లో కూడా మార్పులు చేర్పులు చేశామని ఐఐఎస్ఎల్ సీఈఓ అగర్వాల్ చెప్పారు. దీంట్లో భాగంగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) నిఫ్టీ ఫిఫ్టీ సూచీ నుంచి మూడు షేర్లను తొలగిస్తున్నామని చెప్పారు. కెయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత షేర్లను నిఫ్టీ ఫిఫ్టీ నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీటి స్థానంలో అరబిందో ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్(డీవీఆర్)లను చేరుస్తామని పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే నిఫ్టీలో ఉందని, కొత్తగా చేర్చే ఈ నాలుగు షేర్లతో నిఫ్టీలోని షేర్ల సంఖ్య 51కు, నిఫ్టీలోని కంపెనీల సంఖ్య 50కు పెరుగుతుందని వివరించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు స్టాక్ సూచీలతో మొత్తం 11 స్టాక్ సూచీలున్నాయని పేర్కొన్నారు. -
వచ్చేది సంస్కరణల బడ్జెట్..!
ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతాలు.. * ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం... * గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలవల్లే ఆర్థిక వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్య ముంబై: పార్లమెంటులో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే తమ బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేయనుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం సూచించారు. ఎటువంటి లొసుగులూ లేకుండా- ప్రభుత్వ వ్యయాల వ్యవస్థ హేతుబద్ధీకరణ, ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సంస్కరణల ప్రతిపాదనలను బడ్జెట్లో చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. నిరంతరం రుణ నిధులపై ఆధారపడడంలో ప్రభుత్వానికి విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మార్కెట్ రుణ ప్రణాళిక అంచనా (రూ.5.97 లక్షల కోట్లు) మొత్తంలో నవంబర్ నాటికే (ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలలు ఉండగానే) 99 శాతానికి చేరిన నేపథ్యంలో జైట్లీ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారీగా మార్కెట్ రుణ ప్రణాళికలమీద ఆధారపడటం, రానున్న తరంపై రుణ భారం వేయడమేనన్నారు. ‘ముంబై నెక్స్ట్-అంతర్జాతీయ ఫైనాన్షియల్ కేంద్రంగా ఆవిర్భావం’ అనే పేరుతో జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైట్లీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులను ఉద్దేశించి జైట్లీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. * బడ్జెట్లో స్థిరమైన పన్నుల వ్యవస్థను ఆవిష్కరిస్తాం. మన పన్నుల విధానం ఇన్వెస్టర్లకు పూర్తి సానుకూలంగా లేదు. ఆయా అంశాలను సరిచేసే విషయంలో కేంద్రం గత కొద్ది నెలలుగా తగిన చర్యలు తీసుకుంటోంది. * విద్యుత్, ఇంధనం, రైల్వేలు, పోర్టుల విభాగాల్లో భారీ సంస్కరణలపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు మరింత పెంచుతాం. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రణాళికా వ్యయం కొంత తగ్గించుకోవడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతానికి కట్టుబడి ఉన్నాం. * గడచిన పదేళ్లూ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. అప్పటి ప్రభుత్వం పలు అంశాల్లో తగిన విధానాలు అవలంబించలేదు. పైగా తీసుకున్న పలు తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇన్ఫ్రాకు నిధులపై ముకేశ్ ప్రశ్న! ముంబైలో మౌలిక ప్రాజెక్టులకు ఫైనాన్స్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ... ఇది ఒక్క మహారాష్ట్రకు సంబంధించిన అంశమే కాదని, దేశం మొత్తానికి ఉద్దేశించిందన్నారు. ఫైనాన్సింగ్ వ్యవస్థను మొదట తగిన బాటలో పెడితే, తరువాత ఇన్ఫ్రాకు నిధుల ఏర్పాటు సమస్య చాలా వరకూ తీరిపోతుందని సూచించారు. మౌలిక రంగం అభివృద్ధిలో రాష్ట్రాలకు పూర్తిగా సహకారం లభిస్తుందన్నారు. పొదుపులను ఈ విభాగంలోకి మళ్లించడంపైనా దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ రంగంలో పెట్టుబడులకు ఏ నమూనాలను పాటిస్తున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయా నమూనాలను దేశంలో అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను శోధిస్తున్నామన్నారు. ‘ఇందుకు సంబంధించి త్వరలో మరింత సమాచారం మీకు అందుతుంది’ అని జైట్లీ అన్నారు. నిర్ణయాల్లో జాప్యమే వ్యాపారాలకు అడ్డంకి... - సీబీఐ, కాగ్ వెంటాడుతుతాయనేది అధికారుల భయం - అందుకే చేతులు కట్టేసుకుంటున్నారు... - అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ వ్యాఖ్యలు ముంబై: ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాల్లో వేగం లోపించడమే దేశంలో వ్యాపార రంగానికి అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆరోపించారు. సీబీఐ, సీవీసీ, కాగ్ వంటి దర్యాప్తు, ఆడిటింగ్ ఏజెన్సీలకు భయపడకుండా ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు. టెలికం రంగంలో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నప్పటికీ తాము గత కొన్నేళ్లుగా నిర్ణయాల్లో జాప్యానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ముంబై నెక్స్ట్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో... పారదర్శకత కూడా అంతే ముఖ్యమని అనిల్ అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వాధికారులను కలిసినప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమయ్యేదో ఆయన వివరించారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటే దర్యాప్తు సంస్థలు ఎక్కడ తమపై కన్నేస్తాయోనన్న భయాలు వారిలో ఉన్నాయన్నారు. అందుకే అసలు నిర్ణయాలు తీసుకోకపోవడమే అన్నింటికంటే ఉత్తమం అన్న ధోరణికి వారు అలవాటుపడిపోయారని వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల బొగ్గు గనుల వేలం కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చర్యలకూ తావులేకుండా రక్షణ కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.