సంస్కరణల ఆశలతో లాభాలు
నాలుగో రోజూ పైపైకే..
ముడి చమురు ధరలు రికవరీ కావడం, బడ్జెట్‌లో సంస్కరణలు ఉంటాయనే ఆశలతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్‌లు సానుకూలంగా ఉండటం కూడా కలసివచ్చింది. కమోడిటీ ధరలు పెరగడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆయిల్, గ్యాస్ షేర్ల నేతృత్వంలో స్టాక్ మార్కెట్ లాభాల బాట నడిచింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 23,789 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 7,235పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాల్లోనే ముగిసింది. ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 597 పాయింట్లు ఎగసింది. ఆయిల్, గ్యాస్, ఫార్మా, లోహ, కొన్ని బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
♦ ఎల్‌ఐసీ కొనుగోళ్ల జోరు...: ఎల్‌ఐసీ ఈ క్యూ3లో సెన్సెక్స్ కంపెనీ షేర్లను జోరుగా కొనుగోలు చేసింది. ఈ కాలంలో రూ.10,400 కోట్ల విలువైన 18 సెన్సెక్స్ కంపెనీల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది.
♦ ‘ఏక వ్యక్తి సంస్థ’కు బీఎస్‌ఈ స్టాక్ బ్రోకింగ్ అనుమతులు కనీసం ఇద్దరు డెరైక్టర్లు కలిగిఉన్న ‘ఏక వ్యక్తి సంస్థ’ (ఓపీసీ) కూడా స్టాక్ బ్రోకర్‌గా వ్యవహరించవచ్చని బాంబే స్టాక్ ఎక్స్చేంజీ పేర్కొంది. అయితే, ప్రొప్రైటరీ అకౌంటు ద్వారా ట్రేడింగ్ నిర్వహించడానికి సదరు బ్రోకరుకు అనుమతులు ఉండవని ఈ సందర్భంగా వివరించింది.
కొత్తగా ఐదు నిఫ్టీ స్టాక్ సూచీలు!
ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా కొత్తగా ఐదు స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ సంస్థ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ తెలిపింది. వివిధ స్టాక్ సూచీల్లో షేర్ల ఎంపిక విధానాల్లో కూడా మార్పులు చేర్పులు చేశామని ఐఐఎస్‌ఎల్ సీఈఓ అగర్వాల్ చెప్పారు. దీంట్లో భాగంగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఫిఫ్టీ సూచీ నుంచి మూడు షేర్లను తొలగిస్తున్నామని చెప్పారు. కెయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత షేర్లను నిఫ్టీ ఫిఫ్టీ నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీటి స్థానంలో అరబిందో ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్(డీవీఆర్)లను చేరుస్తామని పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే నిఫ్టీలో ఉందని, కొత్తగా చేర్చే ఈ నాలుగు షేర్లతో నిఫ్టీలోని షేర్ల సంఖ్య 51కు, నిఫ్టీలోని కంపెనీల సంఖ్య 50కు పెరుగుతుందని వివరించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు స్టాక్ సూచీలతో మొత్తం 11 స్టాక్ సూచీలున్నాయని పేర్కొన్నారు.