చమురు పతనంతో మార్కెట్‌కు రిలీఫ్‌  | Sensex surges 336 pts, Nifty tops 11750 as crude oil eases | Sakshi
Sakshi News home page

చమురు పతనంతో మార్కెట్‌కు రిలీఫ్‌ 

Published Sat, Apr 27 2019 1:10 AM | Last Updated on Sat, Apr 27 2019 1:10 AM

 Sensex surges 336 pts, Nifty tops 11750 as crude oil eases - Sakshi

ముడి చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. ప్రధాన స్టాక్‌ సూచీలు మళ్లీ కీలకమైన పాయింట్లపైకి ఎగిశాయి. సెన్సెక్స్‌ 39వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ ఈ నిఫ్టీ 11,750  పాయింట్లపైకి  ఎగబాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు కుమ్మరిస్తుండటం, బ్లూ చిప్‌ కంపెనీలు ప్రోత్సాహకరమైన ఫలితాలను వెల్లడించడం, మే సిరీస్‌కు రోల్‌ఓవర్లు జోరుగా జరగడం  కూడా సానుకూల ప్రభావం చూపించా యి. సెన్సెక్స్‌ 336 పాయింట్ల లాభంతో 39,067 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 11,755 పాయింట్ల వద్ద ముగిశాయి.  

వారంలో తీవ్ర ఒడిదుడుకులు.. 
వారం పరంగా చూస్తే, ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచుతగ్గులకు గురయ్యాయి. మొత్తం ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో నాలుగు రోజుల పాటు సెన్సెక్స్‌ 300 పాయింట్ల రేంజ్‌లో లాభ, నష్టాల మధ్య కదలాడింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్‌ 72 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మాత్రం 2 పాయింట్లు పెరిగింది.  

రోజంతా లాభాలే.... 
ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు దాదాపు అన్నీ అంచనాలకు అనుగుణంగానే ఉండటం కలసివస్తోంది. మరోవైపు  ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఒపెక్‌ చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ముడి చమురు ధరలు పతనమయ్యాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు 75 డాలర్ల దిగువకు దిగివచ్చింది. 1.2 శాతం నష్టంతో 73.41 డాలర్లకు పడిపోయింది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలు పుంజుకొని 70 డాలర్లను తాకింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. చివరి గంటలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 372 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల మేర లాభపడ్డాయి. గురువారం అమెరికా మార్కెట్లు నష్టపోవడంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, నష్టాల్లో ముగిశాయి.  

►గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో మొత్తం ఆదాయం పెరగడంతో టాటా స్టీల్‌ షేర్‌ 6.6 శాతం లాభంతో రూ.545 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
►ఫలితాలు బావుండటంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.760 వద్ద ముగిసింది.  
►ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఎమ్‌సీఎక్స్‌ షేర్‌ 5% లాభంతో రూ.839 వద్ద ముగిసింది.  
► మారుతీ సుజుకీ షేర్‌ వరుసగా ఆరో రోజూ నష్టపోయింది. శుక్రవారం ఈ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.6,832 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో ఈ షేర్‌ దాదాపు 9 శాతం నష్టపోయింది.  
► బజాజ్‌ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement