చరిత్రలోనే అతి గొప్ప ర్యాలీని సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మిస్సయ్యారంటున్నారు సంజీవ్ భాసిన్ ఒక ఇంటర్వ్యూలో. సెప్టెంబర్ తదుపరి స్టాక్ మార్కెట్లు అతి పెద్ద బుల్ ర్యాలీలో ప్రవేశించే వీలున్నట్లు ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ అంచనా వేస్తున్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలు తదితర పలు అంశాలపై సంజీవ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకుందామా..?
అంచనా తప్పు
గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మార్కెట్ల పట్ల అత్యంత బేరిష్ ధృక్పథాన్ని కలిగి ఉన్నారు. దీంతో బఫెట్ గొప్ప ర్యాలీని మిస్ అయ్యారు. నిజానికి వాస్తవ పరిస్థితులను స్టాక్ మార్కెట్లు ప్రతిబింబించడంలేదనే చెప్పాలి. ఒకసారి కోవిడ్‌కు వ్యాక్సిన్ వెలువడ్డాక పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటే ఏం జరుగుతుందన్నది ఆలోచించి చూడండి... నెమ్మదిగానైనా ఇవి జరగబోయే విషయాలే కదా!
సెప్టెంబర్ తదుపరి
సెప్టెంబర్ తరువాత చరిత్రలోనే అతిగొప్ప ర్యాలీ ప్రారంభంకావచ్చు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు మరింత వేగమందుకునే వీలుంది. ఈ సందర్భంలో గత రెండు, మూడేళ్లలో రెట్టింపైన పలు కౌంటర్లు గొప్ప ప్రదర్శన చేయకపోవచ్చు. నేను చెబుతున్న అంశాల్లో మీకు పూర్తి విశ్వాసం కలగకపోవచ్చు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వెలువడితే మార్కెట్లకు ఎక్కడలేని బలం చేకూరుతుంది. దీనిసంగతి పక్కనపెడితే రానున్న మూడు నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ ర్యాలీ చేసే అవకాశముంది. రానున్న మూడు నెలల్లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,500 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. అయితే ఇదే సమయంలో జులైలోనే నిఫ్టీ 11,000ను తాకవచ్చని అత్యంత ఆశావహంగా ఉన్నాం.
ఆటో స్పీడ్
ఆటో రంగంలో ఎస్కార్ట్స్, వీఎస్‌టీ టిల్లర్స్, స్వరాజ్ ఇంజిన్స్, ఎంఅండ్‌ఎం వంటి కౌంటర్లు ఇటీవల బలపడ్డాయి. కనిష్టాల నుంచి ఇవి బౌన్స్ అయినప్పటికీ గత రెండేళ్లుగా హీరో మోటో, ఎంఅండ్‌ఎం పెద్దగా లాభపడింది లేదు. అండర్ పెర్ఫార్మర్లుగా నిలుస్తూ వచ్చాయి. బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారడం, కొంతమేర గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మందగమనం తదితర అంశాలు ప్రభావం చూపాయి. ప్రస్తుతం గ్రామ ప్రాంతాల మార్కెట్లు జోరందుకుంటున్నాయి. పంటల విస్తీర్ణం పెరగడం, ఆదాయాలు మెరుగుపడటం ద్వారా సబ్సిడీ వ్యయాలు తగ్గడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆహార సరుకుల సరఫరాలు పుంజుకోనున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ ఊపందుకోనుంది.
సిప్ పద్ధతిలో
రానున్న మూడు నెలల కాలంలో క్రమానుగత పెట్టుబడి(సిప్) విధానంలో హీరో మోటో, మహీంద్రా, ఐషర్ మోటార్స్ వంటి కౌంటర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చని భావిస్తున్నాం. రానున్న కొద్ది క్వార్టర్లలో మంచి పనితీరును చూపే వీలుంది. ఇక బ్యాటరీలకు పెరగనున్న డిమాండ్ కారణంగా ఎక్సైడ్‌నూ పరిశీలించవచ్చు. ఇదేవిధంగా యూరప్ మార్కెట్లో పెరగనున్న అవకాశాల రీత్యా మదర్‌సన్ సుమీపైనా కన్నేయవచ్చు. కొన్ని కౌంటర్లు ఖరీదుగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ రిటర్నులు అందించే వీలుంది. మంచి మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆటో రంగంలో ఎక్స్‌పోజర్‌ను తీసుకుంటే లాభించగలదు.
టెలికం రింగింగ్
టెలికం రంగానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటితోపాటు స్టీల్, సిమెంట్ రంగాలనూ పరిశీలించవచ్చు. పునర్మిర్మాణ పనులు మొదలయ్యాక ఈ రంగాలకు డిమాండ్ పెరిగే చాన్స్ ఉంది. ఇకపై ఆటో, టెలికం, స్టీల్, సిమెంట్ రంగాలు ఔట్ పెర్ఫార్మ్ చేయవచ్చని భావిస్తున్నాం. ఇక వినియోగ రంగంలో ఐటీసీ, నెస్లేలకూ పెద్దపీట వేయవచ్చు. హోటల్స్ మినహా మిగిలిన విభాగాలు మంచి పనితీరు చూపుతుండటం ఐటీసీకి లాభించగలదు. హెచ్‌యూఎల్‌తో పోలిస్తే ఐటీసీ చౌకగా ట్రేడవుతోంది. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయదలిస్తే పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు, నాలుగు నెలల కాలంలో సిప్ పద్ధతిలో పెట్టుబడులకు ఉపక్రమిస్తే మేలు కలగవచ్చు. మా అంచనాలు నిజమైతే సెప్టెంబర్ తదుపరి ఏడాది లేదా రెండేళ్ల కాలంలో మార్కెట్లు ర్యాలీ చేసే అవకాశముంది!
Comments
Please login to add a commentAdd a comment