యులిప్‌ సరెండర్‌ చేస్తే పన్ను చెల్లించాలా? | business specials | Sakshi
Sakshi News home page

యులిప్‌ సరెండర్‌ చేస్తే పన్ను చెల్లించాలా?

Published Mon, Feb 13 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

యులిప్‌ సరెండర్‌ చేస్తే పన్ను చెల్లించాలా?

యులిప్‌ సరెండర్‌ చేస్తే పన్ను చెల్లించాలా?

నేను ఒక మిత్రుడి ప్రోద్బలంతో 2011లో ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.60,000 ప్రీమియమ్‌ చెల్లిస్తున్నాను. ఈ ప్లాన్‌ వడ్డిస్తున్న అధిక వ్యయాలు, చార్జీలను, ఈ పెన్షన్‌ ప్లాన్‌ పనితీరును  చూస్తుంటే ఈ ప్లాన్‌ నుంచి వైదొలగడమే మంచిదని అనిపిస్తోంది.  నా నిర్ణయం సరైనదేనా?
 – శివరామ్, విశాఖ పట్టణం

ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌ మీకు బీమా కవర్‌ను అందిస్తుంది. అంతేకాకుండా రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేయడం కోసం మీరు చెల్లించే ప్రీమియమ్‌లో కొంత భాగాన్ని ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయితే ఇలాంటి హైబ్రిడ్‌  ఉత్పత్తులు తగిన బీమా రక్షణను, మెరుగైన రాబడులను ఇవ్వలేవు. అందుకని ఈ తరహా ప్లాన్‌ల నుంచి వైదొలగడం మంచి నిర్ణయమే. సంబంధిత ఏజెంట్‌ను సంప్రదించి ఈ ప్లాన్‌ సరెండర్‌కు సంబంధించి విధి విధానాలను తెలుసుకోండి. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపకండి. జీవిత బీమా కోసం టర్మ్‌ బీమా పాలసీని ఎంచుకోండి. టర్మ్‌ బీమా పాలసీల్లో ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్ధిక  లక్ష్యాల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ప్రభుత్వం స్పాన్సర్‌ చేసిన రిటైర్మెంట్‌ ప్లాన్‌ కావాలనుకుంటే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌ఎపీఎస్‌)ను పరిశీలించవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మరిన్ని పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

నేను 2011లో ఒక యులిప్‌ పాలసీ తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఆ పాలసీని సరెండర్‌ చేశాను. సరెండర్‌ చేసిన తర్వాత వచ్చిన మొత్తంపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 – మోహన్, హైదరాబాద్‌

పన్ను పరంగా యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల(యులిప్స్‌)ను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలుగానే వ్యవహరిస్తారు. అంటే జీవిత బీమా పాలసీలకు వర్తించే పన్ను నియమనిబంధనలే యులిప్‌లకు కూడా వర్తిస్తాయి. మీరు తీసుకున్న యులిప్‌లకు ఐదేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ముగిసింది. అందుకని మీరు పొందిన సరెండర్‌ విలువపై ఆదాయపు పన్ను చట్టం ,సెక్షన్‌ 10(10డి) ప్రకారం ఎలాంటి పన్ను భారం ఉండదు. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లకు సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందినా, పొందకున్నా ఇది వర్తిస్తుంది.

నా వయస్సు 29 సంవత్సరాలు. నా నెల జీతం రూ.20,000. నాకు ఇటీవలే పెళ్లి అయింది. నా తల్లిదంద్రులు నాతోనే ఉంటారు. నేను ఎల్‌ఐసీ జీవన్‌ సరళ్‌ పాలసీ తీసుకున్నాను. టర్మ్‌  బీమా పాలసీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.    
– వివేక్, కరీంనగర్‌


జీవన్‌ సరళ్‌ పాలసీ అనేది ఎండోమెంట్‌ ప్లాన్, ఈ తరహా ప్లాన్‌లు తక్కువ బీమా కవర్‌ను ఇస్తాయి. వ్యయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించవు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ,  ఈ పాలసీని సరెండర్‌ చేయడమే ఉత్తమం. టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. బీమా కంపెనీ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రేషియోను, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను  పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. ఈ అంశాల పరంగా చూస్తే మీరు,... ఏగాన్‌ రెలిగేర్‌ ఐటర్మ్‌ ప్లాన్, మ్యాక్స్‌లైఫ్‌ ఆన్‌లైన్‌ టర్మ్‌ ప్లాన్, భారతీ ఆక్సా లైఫ్‌ ఈప్రొటెక్ట్‌.. ఈ పాలసీలను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలు. మీ వయస్సుకు, రూ.50 లక్షల టర్మ్‌ పాలసీకి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియ్‌లు–ఏగాన్‌ రెలిగేర్‌ ఐటర్మ్‌ప్లాన్‌కు రూ.4,560, మ్యాక్స్‌ లైషఫ్‌ ఆన్‌లైన్‌ టర్మ్‌ ప్లాన్‌కు రూ.4,150, భారతీ ఆక్సా లైఫ్‌ ఈ ప్రొటెక్ట్‌కు రూ.4,000 చొప్పున ఉన్నాయి. (ఆరోగ్య వంతుడైన పొగ త్రాగని వ్యక్తికి ఈ ప్రీమియమ్‌లు వర్తిస్తాయి) టర్మ్‌ బీమా పాలసీ తీసుకునేటప్పుడు అన్నీ సరైన వివరాలు వెల్లడించడమే ఉత్తమం. ఇలా చేస్తే, పాలసీ  క్లెయిమ్‌ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

నేను సీనియర్‌ సిటిజన్‌ను, నాకు పన్నుచెల్లించే ఆదాయం లేదు. అయితే గత ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ మ్యూచువల్‌ పండ్‌ విక్రయాల ద్వారా రూ.4 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలు వచ్చాయి. నేను ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుందా?
 – పరంధామ్, విజయవాడ

సీనియర్‌ సిటిజన్‌ల ఆదాయం నిర్దేశిత పరిమితికి మించితే ఆదాయపు పన్ను రిటర్న్‌లు తప్పకుండా దాఖలు చేయాలి. 2015–16 సంవత్సరానికి ఈ నిర్దేశిత పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. మీరు పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.4లక్షలు. సీనియర్‌ సిటిజన్‌లకు నిర్దేశించిన ఆదాయ పరిమితిని(రూ.3 లక్షలు) మించినందున మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులేదు. మీరు పన్ను ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకున్నప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయండి.

ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement