రిటైరయినా పనిచేస్తారా?
♦ ఇలా అనుకోవటం ప్రణాళికను వాయిదా వేయటానికే..
♦ పక్కా ప్లానింగ్‌తో నిశ్చింతగా రిటైర్ కావొచ్చు
♦ ముప్ఫై.. నలభైలలో ఉన్నా సమయం మించిపోలేదు
♦ ప్రణాళికాబద్ధంగా రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవచ్చు
♦ పెట్టుబడి సాధనాలు,పురోగతి సమీక్ష ముఖ్యం
రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే బోలెడన్ని ఆలోచనలొస్తుంటాయి. అన్నింటికన్నా ముందు... అసలు మనం ఎప్పటికీ రిటైరే కాము. ఏదో ఒకటి చేస్తూనే ఉంటామనే ఆలోచన వస్తుంది. నిజానికిది ప్లానింగ్‌ను మరికాస్త వాయిదా వేసుకునేందుకు మనకి మనం సర్ది చెప్పుకోవడం!!. అంతే తప్ప మరొకటి కాదు. సరిగ్గా పదవీ విరమణకు సమయం దగ్గర పడుతున్నప్పుడు... రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత ముఖ్యమో మెల్లగా అర్థం అవుతుంటుంది. సరే... ఏదైతేనేం.. ఎప్పుడైతేనేం.! ముప్ఫైలలో.. నలభయ్యో పడిలో ఉన్నా పర్వాలేదు. అస్సలంటూ చేయకుండా ఉండటం కన్నా ఆలస్యమైనా ఎప్పుడో ఒకప్పుడు ప్లానింగ్ ప్రారంభించడమే మంచిది. సరైన పెట్టుబడి అవకాశాలు గుర్తించి, అమలు చేయగలగడం, లక్ష్యం దిశగా పురోగతిని సమీక్షించుకుంటూ ఉండటం, సరైన నిర్ణయాలు తీసుకోగలగడం.. ఇవే రిటైర్మెంట్ ప్రణాళికలో కీలకం.
ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవసరం
రిటైర్మెంట్ తర్వాత కూడా జాలీగా ఉండగలిగేందుకు వేసుకునే ప్రణాళిక ఒక్కనాటితో అయిపోదు. మెరుగుపడే మీ జీవన విధానాలు, అత్యవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, జీవన ప్రమాణాలు ఇలాంటి వాటి ఆధారంగా దీన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ, సమీక్షలు జరుపుకుంటూ ఉండాలి. కేవలం మీ జీవితాంతమే కాకుండా మీపైనే ఆధారపడిన జీవిత భాగస్వామి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
క్రమంగా పెంచితేనే నిశ్చింత
ఈ ప్లానింగ్‌లో సమయం చాలా కీలకం. రిటైర్మెంట్ నిధి కోసం ఎంత కేటాయించగలరనేది ముందుగా నిర్ణయించుకోండి. ఇప్పుడున్నట్లుగానే పొదుపు చేసుకుంటూ వెడితే.. లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు! కాబట్టి.. కేటాయింపులను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. ఆదాయం పెరిగే కొద్దీ స్థిరంగా అందులో కొంత శాతాన్ని రిటైర్మెంట్ నిధి కోసం కేటాయిస్తుండండి.
షేర్లవైపూ చూడొచ్చు
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులనగానే.. ఫిక్సిడ్ డిపాజిట్లు, పింఛను ఫండ్లు లాంటి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలే గుర్తొస్తుంటాయి. రిస్కులు, రాబడులను బేరీజు వేసుకుని సరైన సాధనాన్ని ఎంచుకోవడమూ కీలకమే. మీరు నలభైలలో ఉన్నా.. పదవీ విరమణకు మరో పదేళ్లు పైగా ఉంటుంది కాబట్టి.. స్టాక్ మార్కెట్లు, షేర్ల వైపు చూడొచ్చు. దశల వారీగా..
తొలి దశలో.. మీ రిస్కు సామర్థ్యానికి తగ్గట్లుగా చక్కని డైవర్సిఫికేషన్ అందించే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేయండి. మిగతా సంప్రదాయ సాధనాల కన్నా మెరుగైన రాబడులు అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ.. తగు మార్పులు, చేర్పులూ చేసుకుంటూ ఉండాలి.
ఇక రెండో దశలో.. రిటైర్ అయ్యాక.. కూడా అదే ఫండ్స్‌లో మీ పెట్టుబడులు కొనసాగించవచ్చు. అదే సమయంలో ప్రతి నెలా మీ ఖర్చులకు ఎంత కావాల్సి ఉంటుందనేది చూసుకుని, ఈ పెట్టుబడుల నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కొంత కొంతగా వెనక్కి తీసుకోవచ్చు.
ఇలాంటి కాంబినేషన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ పెట్టుబడి వేగంగా వృద్ధి చెందడంతో పాటు మీ అవసరాలకు తగ్గట్లుగా విత్‌డ్రా చేసుకునే వీలు కూడా కలుగుతుంది.
ఆరోగ్యం.. అత్యవసరం..
పదవీ విరమణ తర్వాత కూడా జీవన విధానానికి ఢోకా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన హెల్త్ ప్లాన్ కూడా ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే, ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా హడావిడి పడకుండా ఉండేందుకు ప్రత్యేక నిధిని కూడా సమకూర్చుకుని ఉండటం మంచిది.
రిటైర్మెంట్ ప్రణాళిక అమలుకు ఇవ్వాళా.. రేపు అంటూ లేదు. ఎప్పట్నుంచైనా మొదలుపెట్టొచ్చు. ఆ.. ఎప్పట్నుంచనేది.. ఇప్పట్నుంచే ప్రారంభిస్తే.. వీలైనంత సాఫీగా రిటైర్మెంట్ జీవితం గడిపేయొచ్చు.