పింఛను కోసం తిరిగి తిరిగి.. గుండె పగిలి
పింఛను కోసం తిరిగి తిరిగి.. గుండె పగిలి
Published Fri, Dec 9 2016 11:37 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
నిడదవోలు :
పింఛను సొమ్ము కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగిన ఓ వృద్ధుడు తన ఖాతాలో ఆ మొత్తం జమ కాలేదని తెలిసి ఆవేదనతో గుండెపోటు గురై మృత్యువాతపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న బైపే యేసేబు (75) తనకు రావాల్సిన వృద్ధాప్య పింఛను సొమ్ము కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు రోజులుగా వెళుతున్నాడు. కాళ్లు లాగుతున్నా గంటలకొద్దీ క్యూలో నిలబడటం, చివరకు పింఛను సొమ్ము జమకాలేదని బ్యాంక్ సిబ్బంది చెప్పడం పరిపాటిగా మారింది. తనకు పింఛను సొమ్ము వస్తుందో రాదో తెలియడం లేదని, బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నానని, నడిచివెళ్లడం, క్యూలో గంటలకొద్దీ నిలబడాల్సి రావడంతో ఆయాసం, ఒగుర్పు వస్తోందని గురువారం రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడని యేసేబు కుమార్తె రత్నమ్మ వాపోయింది. శుక్రవారం వేకువజామున గుండె పోటుకు గురై మరణించాడని చెప్పింది. యేసేబు భార్య, ఇద్దరు కుమారులు గతంలోనే మరణించాడు. మూడు రోజులపాటు బ్యాంక్ చుట్టూ తిరిగినా పింఛను సొమ్ము రాకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయాడని, చివరకు మృత్యువాత పడ్డాడని అతని కుమార్తె కన్నీళ్లు పెట్టుకుంది.
Advertisement