డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ (ఫైల్)
మంచిర్యాలక్రైం: మద్యం తాగి వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరికొంత మంది వికలాంగులుగా మారి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక ముఖ్య మంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లపై అధ్యయనం చేయగా, ఇందులో వితంతు పింఛన్ పొందుతున్న వారిలో 35 ఏళ్లలోపు మహిళలే అధికంగా ఉన్నట్లు తేలింది. మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం గుర్తించింది. దీని నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మత్తు వదిలిస్తున్నారు.
పెరుగుతున్న డ్రంక్‌అండ్ డ్రైవ్ కేసులు
రోజురోజుకూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో జిల్లాలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్లడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి శ్రీరాంపూర్, సీసీసీ, ఏసీసీ, పాత మంచిర్యాల సమీపంలో పోలీసులు తరుచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాం తాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో నిత్యం రోజుకు లక్షాలాది మంది ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడనే మందు, విందు అన్ని రకాల పనులు చేసుకొని వెళ్తుంటారు. శ్రీరాంపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగరాలకు వెళ్లే ప్రధాన రహదారిపై, శ్రీరాంపూర్, లక్సెట్టిపేట వైపునకు వెళ్లే రహదారులపై తరుచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారి పక్కనే దాబాల్లో రహస్యంగా బెల్ట్‌షాపులు, అక్రమ సిట్టింగులు ఉండటంతో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది.
పోలీసుల అవగాహన
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌తో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. జిల్లావ్యాప్తంగా ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీడ్రైవర్లు ఇతర ప్రైవేటు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వçహిస్తున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
కళాబృందాల ఏర్పాటు
రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఇటీవల మద్యం, çపేకాట, డ్రంక్ అండ్ డ్రైవ్, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల నిర్మూలనకు కళా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళా బృందాల ద్వారా అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో డ్రంక్‌అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించనున్నారు. వారంలో నాల్రోజులు కళా బృందాలు ఆటాపాటల ద్వారా మద్యం తాగడంతో కలిగే అనర్థాలపై వివరించనున్నారు.
పర్సెంటేజీ ప్రకారమే శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సేంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సెంటేజీ వస్తే పోలీసులే జరిమానా వి«ధించి, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది మూడు నెలల్లో 350 కేసులు నమోదు కాగా 153 మందికి జరిమానా విధించారు. వారి లైసెన్స్ రద్దు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారు ప్రమాదంలో మృతి చెందిన, గాయాలపాలైన ఎలాంటి బీమా సదుపాయం వర్తించదని ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వడం గమనార్హం.
కఠిన చర్యలు తీసుకుంటాం
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రంక్‌అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. పట్టుబడిని వారిపై కేసులు నమోదు చేస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. నిబంధలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. రెండు కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే జైలుకు పంపిస్తాం.– సతీశ్, ట్రాఫిక్ సీఐ మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment