పీఎఫ్ చందాదారులకు నెరవేరనున్న సొంతింటి కల
⇒ 90 శాతం వరకూ నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు
⇒ ఈ మేరకు నిబంధనలను సవరించనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని 4 కోట్ల మంది చందాదారులకు సంతోషం కలిగించే కబురును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటి కొనుగోలుకు వారు తమ రిటైర్మెంట్ నిధి నుంచి 90 శాతం నిధులను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సవరణలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది. సవరణల తర్వాత ఈపీఎఫ్‌వో చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఇంటి రుణ ఈఎంఐలు చెల్లించే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఈపీఎఫ్ చందాదారులకు మేలు కలిగించే చర్యగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పథకంలో మార్పులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఈపీఎఫ్) పథకం, 1952లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు పారాగ్రాఫ్ 68బీడీని అదనంగా చేర్చనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు వెల్లడించారు. ‘‘నూతన నిబంధన కింద ఈపీఎఫ్ చందాదారుడు కనీసం 10 మంది సభ్యులతో కూడిన కోపరేటివ్ సొసైటీ లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యుడిగా ఉంటే... నివాస స్థలం లేదా ఫ్లాట్ లేదా నివాస భవన నిర్మాణం లేదా స్థలం కొనుగోలుకు తమ నిధి నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు’’ అని దత్తాత్రేయ వివరించారు.
ఈ పథకం కింద ఇంటి రుణ బకాయిలు, వడ్డీలను తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నెలనెలా చెల్లించుకోవచ్చని కూడా మంత్రి పేర్కొన్నారు. కాగా, తాజా సవరణలో భాగంగా చేర్చనున్న పారాగ్రాఫ్‌ను ఇంకా ఖరారు చేయలేదని, కనుక దీని కింద ఎటువంటి లక్ష్యాలను నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. 2016 మార్చి 31 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు 17.14 కోట్లుగా ఉన్నాయని... 2015–16 ఆర్థిక సంవత్సరానికి సగటున 3.76 కోట్ల సభ్యుల నుంచి చందాలు వచ్చినట్టు సభకు మంత్రి తెలిపారు.