వేడుకలకూ విమానంలో షికారు.. | Business travelers can now book corporate jets via app | Sakshi
Sakshi News home page

వేడుకలకూ విమానంలో షికారు..

Published Wed, Mar 16 2016 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

వేడుకలకూ విమానంలో షికారు..

వేడుకలకూ విమానంలో షికారు..

జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనిక టేక్రివాల్
ప్రత్యేక విమానాలకు పెరుగుతున్న క్రేజ్
విదేశాలు చుట్టి వస్తున్న యువ జంటలు
ఈ ఏడాది 14 జెట్స్ కొంటున్నాం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం, విహారం, వేడుక.. సందర్భం ఏదైతేనేం ప్రత్యేక విమానాల్లో విహరించడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అనుకూల సమయానికితోడు ప్రైవసీ ఉంటుందన్నది కస్టమర్ల భావన. అంతేకాదు ప్రయాణ ఖర్చులూ ఇతర విమానాల మాదిరిగానే ఉంటున్నాయి. ఇంకేం ఒక్క క్లిక్‌తో ప్రత్యేక విమానంలో దూసుకెళ్తున్నారని అంటున్నారు జెట్‌సెట్‌గో ఏవియేషన్ సర్వీసెస్ సీఈవో కనిక టేక్రివాల్. రేడియో క్యాబ్స్ మాదిరిగా జెట్‌సెట్‌గో.ఇన్ వెబ్‌సైట్ ద్వారా విమాన సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ భారత్‌లో ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లను ఒక వేదికపైకి తొలిసారిగా తీసుకొచ్చింది. మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ విస్తరణపై సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవీ..

 ప్రత్యేక విమానాల అవసరం ఏ విధంగా పెరుగుతోంది?
వ్యాపారస్తులైనా, మరొకరైన తక్కువ సమయంలో మరో నగరానికి చేరుకోవాలంటే ప్రత్యేక విమానాలు బెటర్. భారత్‌లోని నగరాలే కాదు యూఎస్, దుబాయ్, హాంకాంగ్, ఆఫ్రికా తదితర దేశాలను చిన్న విమానాల్లో ఇక్కడి నుంచి చుట్టివస్తున్నారు. అలాగే ఒక విమానంలో తమవారితో మాత్రమే ప్రయాణించడంలో ఉన్న సంతృప్తి అంతా ఇంతా కాదు. పెళ్లికి వచ్చిన బంధువులకు జాయ్ రైడ్స్ చేయించడం, కొత్త జంటలు హనీమూన్‌కు విదేశాలు లేదా దేశీయంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లడం, ఫొటో షూట్స్ కోసం విమానాల్లో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబ సభ్యులతో పక్షులు, జంతువులూ ప్రయాణించడం విశే షం.

 కంపెనీ ఆఫర్ చేస్తున్న చార్జీల వివరాలు చెప్పండి?
దూరాన్నిబట్టి మాత్రమే చార్జీ చేస్తున్నాం. పౌర విమానయాన రంగంలో ఉన్న సంస్థలు సమయాన్నిబట్టి చార్జీ చేస్తాయి. అంటే రేపో ఎల్లుండో టికెట్ కావాల్సి వస్తే కస్టమర్‌కు తడిసిమోపెడు కావాల్సిందే. పూర్తి విమాన బుకింగ్‌తోపాటు ఒక విమానంలో పలువురు ప్రయాణించేలా విడిగా టికెట్లను విక్రయిస్తున్నాం. జెట్ స్టీల్ పేరుతో రూ.4 వేల నుంచే ఒక్కో టికెట్‌ను అందుబాటులోకి తెచ్చాం. అలాగే గంటకు రూ.40 వేలతో 4 సీట్లున్న చిన్న విమానాన్ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-తిరుపతి, బెంగళూరు-చెన్నై తదితర రూట్లలో గంటలో ప్రయాణించొచ్చు. 17 సీట్లున్న విమానమైతే రూ.4 లక్షలు ఖర్చు అవుతుంది. 

 రోజుకు ఎన్ని బుకింగ్స్ నమోదు చేస్తున్నారు?
2014 మార్చిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ ఏడాది మొత్తం 300 బుకింగ్స్ అయ్యాయి. 2015లో ఈ సంఖ్య 1,100లకు పైమాటే. ఇప్పుడు రోజుకు 6 బుకింగ్స్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏడాది కాలానికిగాను కంపెనీ చేతిలో రూ.130 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటి వరకు రూ.60 కోట్ల వ్యాపారం చేశాం. వేడుకలకు, సమావేశాలకు పెద్ద విమానాల బుకింగ్ సేవలను అందిస్తున్నాం. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌తో చేతులు కలిపాం. ఎమర్జెన్సీ మెడికల్ ఫ్లైట్స్ కోసం రోజుకు ఒక బుకింగ్ వస్తోంది. హైదరాబాద్ నుంచి వారంలో 8 బుకింగ్స్ అవుతున్నాయి.

 సొంతంగా విమానాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందా?
ప్రస్తుతం కంపెనీ చేతిలో 10 సీట్లున్న హాకర్ బీచ్‌క్రాఫ్ట్ విమానముంది. ఈ ఏడాది డిసెంబరుకల్లా మరో 14 జెట్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఇక వివిధ కంపెనీలు, వ్యక్తులకు చెందిన 120 ఎయిర్‌క్రాఫ్ట్స్ మా వద్ద రిజిష్టర్ అయి ఉన్నాయి. వీటిలో 35 హెలికాప్టర్లున్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను (అంబులెన్సు) 8 విమానాలు అందిస్తున్నాయి. రూ.5 వేలతో కంపెనీని పెట్టాం. 8 మంది సిబ్బందితో మొదలై ఇప్పుడు 50 మంది వరకు ఉన్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, దుబాయి, లండన్, న్యూయార్క్‌లో ఆఫీసులున్నాయి. త్వరలో హైదరాబాద్, విజయవాడలో కార్యాలయాలు ప్రారంభిస్తాం. అయిదేళ్లలో మూడు రెట్ల వ్యాపారం నమోదవుతుందని ఆశిస్తున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement